ఏలేరు నుంచి భారీగా నీరు విడుదల.. పిఠాపురానికి పొంచి ఉన్న ముప్పు...!
కాకినాడ జిల్లాలో ఏలేరు ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ...
దిశ, కాకినాడ జిల్లా ప్రతినిధి: కాకినాడ జిల్లాలో ఏలేరు ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికి ఏలేరు ప్రాజెక్టు మూడు గేట్లు అధికారులు ఎత్తివేసి 5,770 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. రాత్రి తర్వాత 7 వేల క్యూసెక్కుల వరకూ నీటిని విడుదల చేసే అవకాశాలను అధికారులు పరిశీలించారు. ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గానికి ముప్పు పొంచి ఉండటంతో కింది ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండండి.. టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్
ఏలేరు ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం విడుదల చేస్తున్న ఐదువేలు నుంచి పది వేల క్యూసెక్కుల వరకు నీరు విడుదల చేసే అవకాశం ఉన్నందున మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని టెలికాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు. ఆదివారం మండల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, అన్ని మండలాల తహశీల్దార్లు, ఇతర అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో అధికారులంతా ఏలేరు కెనాల్ ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ఏలేరు, సుద్దగడ్డ వాగు ప్రభావిత మండలాల్లో తహసిల్దార్లు మరింత ఆప్రమత్తంగా ఉండాలన్నా రు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించాలన్నారు. అవసరమైన చోట బోట్లు వినియోగించుకునేందుకు బోట్లు ముందస్తుగా ఏర్పాటు చేయాలని మత్య శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. చెరువులు, గండ్లకు తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. అదేవిధంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.