రణరంగం: గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత
విశాఖపట్నంలోని గంగవరం పోర్టు రణరంగంగా మారింది.
దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖపట్నంలోని గంగవరం పోర్టు రణరంగంగా మారింది. పోర్టు వద్ద గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. గంగవరం పోర్టులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు పలు డిమాండ్లతో 45 రోజులుగా ఆందోళన చేస్తున్నారు.తమకు కనీస వేతనాలు చెల్లించాలనే డిమాండ్‌తో పోర్టు కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే కార్మికుల పోరుపై అదానీ యాజమాన్యం స్పందించడం లేదు. దీంతో గంగవరం పోర్టు ముట్టడికి కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా పోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. గంగవరం పోర్టు వైపునకు వెళ్లే అన్ని దారులను మూసి వేశారు. అయినప్పటికీ కార్మికులు తగ్గలేదు. అదానీ గంగవరం పోర్టు వద్ద ముళ్లకంచెను దూకి కార్మికులు పోర్టు వైపునకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అటు పోలీసులు ఇటు కార్మికుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు, కార్మికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.అయినప్పటికీ కార్మికులు పోర్టు ముట్టడికి పోర్టులోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు కిందపడిపోగా గాయాలపాలయ్యారు. దీంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పినట్లు తెలుస్తోంది. లాఠీ చార్జి చేసి ఆందోళన కారులను చెదరగొట్టినట్లు తెలుస్తోంది. ఇకపోతే కార్మికుల గంగవరం పోర్టు ముట్టడికి పలు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. వామపక్ష పార్టీలతోపాటు కాంగ్రెస్, వైసీపీ నేతలు మద్దతు పలికారు.మరోవైపు కార్మికులతో పాటు పోర్టు నిర్వాసితులు కూడ ఆందోళనలో పాల్గొన్నారు.