TDP: ధరల్లో ఏపీ నెంబర్-1
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు తెలుగుదేశం పార్టీ రోజుకో అంశంపై నిరసన తెలియజేస్తూ హాజరవుతోంది...
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు తెలుగుదేశం పార్టీ రోజుకో అంశంపై నిరసన తెలియజేస్తూ హాజరవుతోంది. అప్పుల ఆంధ్రప్రదేశ్ అంటూ బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున ప్లకార్డులతో నిరసన తెలుపుతూ హాజరైన టీడీపీ శుక్రవారం జే ట్యాక్స్ వల్లే ఏపీ నెంబర్ వన్ అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపింది. వైసీపీ నాలుగేళ్ల పాలనలో పెరిగిన ధరలను నిరసిస్తూ టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. ‘సీఎం పీఠంపై జగన్ దరిద్రపు అడుగు పేదల బతుకులపై పిడుగు. కరెంట్ బిల్లు నాడు రూ.500, నేడు రూ.1500. పెట్రోల్ నాడు రూ.75, నేడు రూ.112’ అంటూ ప్లకార్డుల ప్రదర్శన చేశారు. జే-టాక్స్‌లతో ప్రజలను బజారున పడేసిన ప్రభుత్వం, ధరల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1అనే నినాదంతో ర్యాలీగా అసెంబ్లీకి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లారు.
జగన్ సీఎం అయ్యాక ...
మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప మాట్లాడుతూ జగన్ సీఎం అయ్యాక సామాన్యులు బతికే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్న తీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనబడిందన్నారు. ధరల పెరుగుదలతో ప్రజలు అప్పులపాలవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని నడిపే శక్తిని కూడా జగన్ కోల్పోయాడని చినరాజప్ప విమర్శించారు.
ఇవి కూడా చదవండి:
వైనాట్ 175 అంటున్న జగన్.. వైసీపీకి నో ఓట్ అంటున్న జనం: టీడీ జనార్దన్