AP Politics: దళితుల అభ్యున్నతి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం.. టీడీపీ ఎమ్మెల్యే

అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడింది ఒక తెలుగుదేశం పార్టీ అని కొండపి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు.

Update: 2024-04-11 06:27 GMT

దిశ కొండపి: అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడింది ఒక తెలుగుదేశం పార్టీ అని కొండపి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. బుధవారం మండల పరిధిలోని వావిలేటిపాడులో మాదిగల ఆత్మీయ సదస్సు జరిగింది.

 

ఈ సదస్సులో ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, దామచర్ల సత్య, రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు, డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఆదిములపు సురేష్ మంత్రిగా ఉండి జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఆయన ప్రాతినిధ్యం వహించిన మూడు నియోజకవర్గాల్లో ఏమి అభివృద్ధి చేశారు ప్రజలకు చెప్పాలని నిలదీశారు.

 

ఒంగోలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తాను ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఒక ఎంపీగా ఉండి కూడా పార్లమెంట్లో ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయాను అని ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకే నారా చంద్రబాబునాయుడు పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని, మీరు పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని ఆయన అన్నారు.

ఇక  వైసీపీ ప్రభుత్వంలో దళితులు రాష్ట్రవ్యాప్తంగా బాధించబడ్డారని, ఆ ఘటనలు విన్నప్పుడు బాధపడ్డానని 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

అనంతరం టీడీపీ కార్య నిర్వాహన కార్యదర్శి దామచర్ల సత్య మాట్లాడుతూ.. దామచర్ల మాగుంట కుటుంబాలు ప్రజాసంక్షేమం కోసం పనిచేసాయి తప్ప దోచుకోవడం కోసం దాచుకోవడం కోసం రాలేదని తెలిపారు.

కొండేపి నియోజకవర్గం శాంతికి మారుపేరని కానీ ప్రస్తుత వైసీపీ అభ్యర్థులను చూస్తుంటే ప్రజలకు భయమేస్తుందని మండిపడ్డారు. మంత్రి ఆదిములపు సురేష్ ఇప్పటి వరకు మూడు నియోజకవర్గాలు మారి ఇప్పుడు కొండేపి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ బెల్లం సత్యనారాయణ, బీజేపీ కొండేపి నియోజకవర్గ ఇన్చార్జి మిడసల బాలకోటయ్య, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు పోకూరి రవీంద్రబాబు, రాష్ట్ర టిడిపి ఎస్సీసెల్ కార్యదర్శి పునుగోటి కొండయ్య, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి అయినంపూడి రమేష్, టీడీపీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి వేముల విజయనిర్మలతోపాటు ఆరు మండలాల ఎస్సీ సెల్ అధ్యక్షులు పాల్గొన్నారు.

Tags:    

Similar News