వారి ఆవేదన చూసి సీఎం జగన్కు లేఖ
అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్కు లేఖ రాశారు. ..
దిశ, ఏపీ బ్యూరో: అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్కు లేఖ రాశారు. వాళ్లకు ఇవ్వాల్సిన రూ.3,080 కోట్లను వెంటనే చెల్లించాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ విషయంలో టీడీపీ ప్రభుత్వంపై అప్పటి ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ విషం చిమ్మారని, ఎన్నో ఆరోపణలు చేశారని, సీఎం మరచినా తాము మరవలేదని లోకేష్ గుర్తు చేశారు. వైఎస్సార్ హయాంలో పుట్టిన అగ్రిగోల్డ్ ఆయన సర్కారులోనే కుంభకోణానికి పాల్పడిందని తెలిపారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ ఆస్తులు రూ. 21 వేల ఎకరాలను అటాచ్ చేసిందన్నారు. యాజమాన్యాన్ని అరెస్టు చేయించి, బాధితులకు న్యాయం చేసిందని లోకేష్ పేర్కొన్నారు.
ప్రతిపక్షనేతగా హామీలిచ్చి గద్దెనెక్కాక జగన్ చేసిన మోసంతో అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డున పడ్డారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో అగ్రిగోల్డ్ బాధితులకు ఇస్తామన్న సొమ్ములేవని ఆయన ప్రశ్నించారు. నాడు టీడీపీ ప్రభుత్వం డిపాజిటర్లకి ఇవ్వడానికి సిద్ధం చేసిన రూ.250 కోట్లు పంపిణీ చేయలేదని గుర్తు చేశారు. అదే సొమ్ములో రూ. 14 కోట్లు తగ్గించి, 22 వారాల తర్వాత రూ. 236 కోట్లే పంపిణీ చేసి చేతులు దులుపుకోలేదా అని నిలదీశారు. మానవత్వంతో పని చేసే ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటున్న మీ పాలనలో చనిపోయిన 600 మంది అగ్రిగోల్డ్ బాధితుల్లో ఏ ఒక్క కుటుంబానికైనా ఇస్తామన్న రూ.10 లక్షల పరిహారం ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇదేనా మానవత్వం అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
2014-19 మధ్యలో బలవన్మరణాలకు పాల్పడిన 142 మంది అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాలకు 5 లక్షల వరకూ ఎక్స్ గ్రేషియాను నాటి టీడీపీ ప్రభుత్వం అందించినట్లు లోకేష్ గుర్తు చేశారు. ‘నాటి ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్ చేస్తే ప్రతిపక్షనేతగా మీరు చేయని ఆరోపణ లేదు.. నేను అగ్రిగోల్డ్ భూములు కొట్టేశానన్నారు.. మీరు సీఎం అయి ఐదేళ్లయినా అగ్రిగోల్డ్‌కి చెందిన ఒక్క సెంటు ఆస్తి అయినా అటాచ్ చేయలేదు ఎందుకో చెబుతారా.’ అంటూ లోకేష్ నిలదీశారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై సీఎం జగన్, ఆయన అనుచర గణం కన్నేసి దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అగ్రిగోల్డ్ బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. ఇప్పటికీ 10 లక్షలకు పైగా అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఈ ప్రభుత్వం దిగిపోయే లోపు సొమ్ములు చెల్లించి న్యాయం చేయాలని కోరుతున్నట్లు లోకేష్ లేఖలో వెల్లడించారు.