Nara lokesh కీలక హామీ.. మర్చిపోకుండా శిలాఫలకం

వైసీపీ పాలనలో అన్ని వర్గాలు కష్టాలు ఎదుర్కొంటున్నాయని, జగన్​ సర్కారును ఇంటికి సాగనంపాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​ అన్నారు.....

Update: 2023-12-16 16:40 GMT

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ పాలనలో అన్ని వర్గాలు కష్టాలు ఎదుర్కొంటున్నాయని, జగన్​ సర్కారును ఇంటికి సాగనంపాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్​ అన్నారు.. యువగళం పాదయాత్ర శనివారం 3,100 కిలోమీటర్లకు చేరింది. టీడీపీ అధికారానికి రాగానే అనకాపల్లి – చోడవరం మధ్య రైల్వే వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు అనకాపల్లి గౌరీ గ్రంథాలయం వద్ద శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.

అంతకుముందు అనకాపల్లి రింగు రోడ్డు వద్ద బెల్లం రైతులు, వ్యాపారులు లోకేష్​ను కలిసి సమస్యలను ఏకరువు పెట్టారు. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దదైన అనకాపల్లి బెల్లం మార్కెట్​ ఇప్పుడు కునారిల్లుతోందని వాపోయారు. నల్లబెల్లంపై ఆంక్షలు పెట్టడంతో ధరలు పడిపోయినట్లు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. మార్కెట్​పై ఆధారపడిన 800 మంది కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. టీడీపీ హయాంలో నిర్మించిన డ్యాం ద్వారా 28,500 ఎకరాలకు సాగునీరు అందుతుంటే ప్రస్తుత వైసీపీ సర్కారు నిర్వహణ సరిగ్గా చేపట్టక గేట్లు పాడైపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలు పూడికతో నిండిపోయినట్లు లోకేష్​‌కు వివరించారు.

రైతుల సమస్యలపై లోకేష్​ స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం వల్ల అన్నమయ్య, గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు కొట్టుకుపోయినట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టుల నిర్వహణకు ప్రాధాన్యమిస్తామన్నారు. బెల్లంపై నిషేధం ఎత్తేసి మార్కెట్​కు పునర్వైభవం తీసుకొస్తామన్నారు.

అనకాపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించిన తర్వాత ప్రైవేటు టీచర్స్​, లెక్చరర్స్​ అసోసియేషన్​ ప్రతినిధులు లోకేష్​ను కలిశారు. చాలా తక్కువ వేతనాలతో ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు ఇంటి స్థలాలివ్వాలని అడిగారు. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో అధ్యాపకులకు వేతన చట్టం తీసుకురావాలని సూచించారు. పీఎఫ్​, ఈఎస్​ఐ వర్తింపజేయాలని వినతి పత్రం సమర్పించారు. టీడీపీ–జనసేన ప్రభుత్వం వచ్చాక ప్రైవేటు టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని లోకేష్​ హామీనిచ్చారు. కాపుల సంక్షేమానికి తప్పకుండా కృషి చేస్తామని, తనను కలిసిన కాపు సామాజిక వర్గ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. కాపు కార్పొరేషన్​కు నిధులు ఇస్తామని లోకేష్ తెలిపారు.


Tags:    

Similar News