స్కిల్ స్కామ్‌పై టీడీపీ కీలక నిర్ణయం: ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు వెబ్ సైట్ విడుదల

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లోఎలాంటి అవినీతి జరగలేదని నిరూపించే వాస్తవాలను ప్రతిరోజు ప్రజల ముందు ఉంచుతున్నాం.

Update: 2023-09-15 09:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ‘స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లోఎలాంటి అవినీతి జరగలేదని నిరూపించే వాస్తవాలను ప్రతిరోజు ప్రజల ముందు ఉంచుతున్నాం. చంద్రబాబునాయుడి లాంటి జాతీయ నాయకుడు తప్పుచేయలేదనే వాస్తవం ప్రపంచవ్యాప్తంగా తెలియాలనే అన్ని ఆధారాలతోకూడిన వాస్తవాలను పబ్లిక్ డొమైల్ పెట్టాలని నిర్ణయించుకున్నాం’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ‘స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్’ కు సంబంధించి పూర్తి వాస్తవాలతో కూడిన వెబ్ సైట్‌ను ప్రజల ముందు ఉంచినకు సంబంధించి పూర్తి వాస్తవాలతో కూడిన వెబ్ సైట్ ను ప్రజల ముందు ఉంచింది. వెబ్ సైట్ లోని వివరాలు పరిశీలిస్తే, చంద్రబాబు ఏంచేశారో, యువత భవితకోసం ఎంతగా తపనపడి, ఎంత ప్రణాళికాబద్ధంగా పనిచేశారో, ఈ ప్రభుత్వం ఏవిధంగా దుష్ప్రచారం చేస్తుందో ప్రజలకు తెలుస్తుందని అచ్చెన్నాయుడు తెలిపారు. స్కిల్ స్కామ్ కేసులో ప్రజలకు వాస్తవాలు తెలియ చెప్పడానికే apskilldevelopmenttruth.com వెబ్ సైట్‌ను ప్రారంభించినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.

2014 నవంబర్లో సిమెన్స్ సంస్థ నుంచి అప్పటి ప్రభుత్వానికి వచ్చిన ప్రతిపాదన మొదలు, తదనంతరం జరిగిన అన్ని పరిణామాలను వరుసక్రమంలో పూసగుచ్చినట్టు గా వెబ్ సైట్‌లో వివరించినట్లు తెలిపారు. ‘స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఏపీలో టీడీపీప్రభుత్వం అమలుచేయకముందే దేశంలో అనేక రాష్ట్రాలు అమలుచేశాయి. గుజరాత్ లో 2014లో, ఝార్ఖండ్ లో 2016లో, తమిళనాడు, కర్ణాటకలో 2017లో అమలు చేశారు. ఆయా రాష్ట్రాల్లో ప్రాజెక్ట్ అమలు.. దాని వెనకున్న విధివిధానాలు సహా, ఏపీలో మొత్తం ప్రాజెక్ట్ అమలు తీరుని ఆధారాలతో సహా వెబ్ సైట్లో వివరించాం. విభజనానంతర ఏపీలో దిక్కుతోచని స్థితిలో ఉన్న రాష్ట్ర యువత భవిత కోసం గొప్ప సదుద్దేశంతో చంద్రబాబు చేపట్టిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పనితీరు బాగుందని జగన్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రశంసించింది’ అని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.

70వేల మందికి ఉద్యోగాలు

ప్రాజెక్ట్ తీసుకొచ్చి, యువతకు ఉపాధి కల్పించింది టీడీపీ అయితే, అంతా తానే చేశానని జగన్ రెడ్డి ప్రచారం చేసుకున్నాడు అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. టీడీపీప్రభుత్వంలో సమర్థవంతంగా ప్రాజెక్ట్ అమలుచేసినందుకు గాను వచ్చిన అవార్డుని వైసీపీ ప్రభుత్వం స్వీకరించి, తానే అంతా చేసినట్టు చెప్పుకుంది అని అన్నారు. జగన్ రెడ్డి ఫోటోలతో పత్రికల్లో, ఇతర ప్రసారమాధ్యమాల్లో ప్రజలకు కనిపించేలా భారీగా హోర్డింగులు ఏర్పాటుచేసి, అంతా తామే చేసినట్టు ప్రచారం చేసుకున్నారు అని ఆరోపించారు. అయినా దానిపై తామేం స్పందించలేదు.. ప్రాజెక్ట్ అమలై యువత బాగుపడితే చాలని సంతోషించాం. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటైన 6 క్లస్టర్లలో దాదాపు 2,17,500 మంది యువత శిక్షణ పొందితే, వారిలో దాదాపు 70వేల మందికి ఉపాధి, ఉద్యోగాలు లభించాయి అని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. అనంతపురం స్కిల్ డెవలప్ మెంట్ క్లస్టర్లో 37,500 మంది, గుంటూరు క్లస్టర్లో 35,500 మంది, విశాఖపట్నం క్లస్టర్లో 34,000 మంది, తూర్పుగోదావరి క్లస్టర్లో 34,000, కృష్ణా జిల్లా క్లస్టర్లో 39,000 మంది, చిత్తూరు క్లస్టర్లో 37,500 మంది యువత శిక్షణ పొందారు అని వెబ్‌సైట్‌లో వివరించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపడాన్ని తెలుగుజాతి మొత్తం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తోంది అని చెప్పుకొచ్చారు. రూ.370కోట్లు అవినీతి జరిగిందని, చంద్రబాబు నిధులు కాజేశారని కావాలనే సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారు అని మండిపడ్డారు. సీఐడీ, వైసీపీప్రభుత్వం, అధికారంలో ఉన్నవారు చెప్పేది...చేసేందంతా ముమ్మాటికీ దుష్ప్రచారమే అనడానికి తాము వెబ్ సైట్లో వెల్లడించిన వివరాలే నిదర్శనం అని చెప్పుకొచ్చారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు అనేది కేబినెట్ ఆమోదంతోనే జరిగింది. దానికి సంబంధించిన కేబినెట్ రిజల్యూషన్, ఇతర జీవోలన్నీ వెబ్ సైట్లో ఉంచాం. సిమెన్స్ సంస్థతో సంప్రదింపులు జరిపి, వారు ఏ రాష్ట్రాల్లో అయితే పనిచేశారో, ఆయా రాష్ట్రాల్లో జరిగిందాన్ని పరిశీలించాకే, ప్రాజెక్ట్ అమలుపై ముందడుగు వేశాం అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

వైసీపీ పతనం స్టార్ట్ అయ్యింది

క్విడ్ ప్రోకో పదాన్ని తెలుగువారికి పరిచయం చేసింది ఎవరో ప్రత్యేకంగా చెప్పాలా? ఈ ప్రభుత్వ పతనం మొదలైంది కాబట్టే ఇంతపెద్ద తప్పు చేసింది అని అచ్చెన్నాయుడు అన్నారు. స్కిల్ స్కామ్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా, చంద్రబాబునాయుడికి, అచ్చెన్నాయుడికి, లోకేశ్ కు ఫలానా వారి నుంచి డబ్బులు వచ్చాయని నిరూపించకుండా నోటికొచ్చినట్టు ఎలా ఆరోపణలు చేస్తారు? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి పతనం మొదలైంది. కాబట్టే ఇంత తప్పుడు పనికి పాల్పడ్డారు. ప్రజా నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేసి, జైలుకు పంపినందుకు ఇంతకింత మూల్యం చెల్లించు కుంటారు అని హెచ్చరించారు.

స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కేంద్రాల్లో ఎలాంటి పరికరాలు, సాఫ్ట్ వేర్ పరిజ్ఞానం లేదని సీఐడీ, జగన్ రెడ్డి ప్రభుత్వం ఎలా చెబుతాయి? అని ప్రశ్నించారు. శిక్షణా కేంద్రాల పరిశీలనకు వెళ్లకుండా టీడీపీ నేతల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? కాలేజీల యాజమాన్యాలను బెదిరించి, శిక్షణా కేంద్రాలకు ఎందుకు తాళాలేయిస్తున్నారు? అని నిలదీశారు. ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా, అన్యాయంగా చంద్రబాబునాయుడిపై అభాండాలు వేసి, జైలుపాలు చేసిందో. ప్రజలంతా వాస్తవాలు తెలుసుకొని, ఈ నీతిమాలిన ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలి అని అచ్చెన్నాయుడు సూచించారు. 

Tags:    

Similar News