గెలుస్తామనే ధీమాలో టీడీపీ, జనసేన.. ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆశలు

టీడీపీ, జనసేన కూటమి గెలుస్తుందనే ధీమాతో ఆ రెండు పార్టీల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది.

Update: 2024-01-19 02:06 GMT

టీడీపీ, జనసేన కూటమి గెలుస్తుందనే ధీమాతో ఆ రెండు పార్టీల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకత తమకు లాభిస్తుందని రెండు పార్టీలు భావిస్తున్నాయి. షర్మిల సారథ్యంలోని కాంగ్రెస్​ పార్టీ వైసీపీ ఓట్లకు గండి కొడుతుందని గంపెడాశతో ఉన్నాయి. ఎటొచ్చీ బీజేపీ వైఖరిపైనే మల్లగుల్లాలు పడుతున్నాయి. తటస్థంగా ఉంటుందా లేక టీడీపీతో కలిసొస్తుందా.. అంతర్గతంగా వైసీపీకి సహకరిస్తుందా అనేది అంచనా వేయలేకపోతున్నాయి. టీడీపీ ప్రకటించిన పథకాలు జగన్ ఇస్తున్నవే కదా అనే అభిప్రాయం పేదల నుంచి వ్యక్తం అవుతోంది. మధ్య తరగతి వారు మాత్రం పథకాల పట్ల సుముఖంగా లేరని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దిశ, ఏపీ బ్యూరో : ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైసీపీ పీకల్లోతు సమస్యల్లోకి జారిపోతోంది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు సొంత పార్టీలోనే తిరుగుబాట్లకు అవకాశమిచ్చింది. నియోజకవర్గాల మార్పు చేర్పులు, సిట్టింగులకు టిక్కెట్ల నిరాకరణ ఆ పార్టీని కుదిపేస్తున్నాయి. మరోవైపు సీఎం జగన్​ చెల్లెలు షర్మిల కాంగ్రెస్​ పగ్గాలు చేపడుతున్నారు. ఎంతమంది నాయకులు, కార్యకర్తలను లాక్కెళ్తారోననే ఆందోళన రేకెత్తిస్తోంది. ఇవన్నీ తమ విజయానికి సోపానాలుగా టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. గెలుపు లాంఛనమేనన్నట్లు సంతోషంలో మునిగి తేలుతున్నాయి.

సానుభూతి కోసం జగన్ యత్నం..

సీఎం జగన్​ మాత్రం విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నారు. ప్రజలకు అందుబాటులో లేని.. ప్రజా సమస్యలను పట్టించుకోని నేతలను ఏరిపారేస్తున్నట్లు పార్టీ క్యాడర్​లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. గత ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయామనే ఉక్రోషంతో అన్నీ పార్టీలు ఏకమై తన మీద యుద్ధానికి తలపడుతున్నట్లు జగన్ ప్రజల నుంచి సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు. పేదలకు తామిస్తున్న పథకాలను ఓర్వలేక ఆచరణకు సాధ్యం కాని హామీలు గుప్పిస్తున్నారంటూ విపక్షాలపై ఎదురు దాడి చేస్తున్నారు. వైసీపీలో చెత్తను వేరేస్తుంటే.. ఆ చెత్తను తీసుకెళ్లి ఏం చేసుకుంటారంటూ విపక్షాలను జగన్​ టార్గెట్ చేస్తున్నారు.

వైసీపీ ధీమా వెనుక..

వైసీపీ మళ్లీ గెలుస్తుందనే ధీమా వెనుక బీజేపీ సాయం ఉండే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటిదాకా ఢిల్లీ బాద్​ షాలు తాము ఎటు వైపుండేదీ స్పష్టం చేయలేదు. టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తే మళ్లీ వైసీపీ అధికారానికి రావొచ్చని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. తటస్థ వైఖరితో ఒంటరిగా బరిలోకి దిగి అంతర్గతంగా టీడీపీ కూటమికి ఆసరాగా నిలుస్తుందా.. వైసీపీకే రహస్య మిత్రుడిగా సాయం చేస్తుందా అని రెండు వైపులా ఉత్కంఠ నెలకొంది. అయోధ్యలో రాముడి గుడి ప్రారంభోత్సవం అయ్యాక కమలనాథుల నిర్ణయం వెలువడే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News