‘టీడీపీ అంటే అంత చులకనా?’.. అధికారి పై పిఠాపురం కీలక నేత ఫైర్
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అంటే అంత చులకనా..ఏ ఒక్క ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానం ఉండటం లేదు, కేడర్‌ను గుర్తించకపోతే ఏలా అంటూ అధికారుల తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు.
దిశ,పిఠాపురం:పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అంటే అంత చులకనా..ఏ ఒక్క ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానం ఉండటం లేదు, కేడర్‌ను గుర్తించకపోతే ఏలా అంటూ అధికారుల తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. మమ్మల్ని కార్యక్రమాలకు ఎవరు పిలవద్దంటున్నారో చెప్పండని, అక్కడే తేల్చుకుంటామంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కలిసి చేయాల్సిన కార్యక్రమాలలో కలయికలేకుండా చేయడం పట్ల వర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల శ్రావణ మాస శుక్రవారం పూజలకు టీడీపీని ఆహ్వానించకపోవడం పై ఆయన ఈవోను నిలదీశారు. పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వర్మ తన మనసులో మాటను బయటపెట్టారు. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం ఉండకపోవడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు.
ఇటీవల కాలంలో పిఠాపురం పాదగయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలకు ఎటువంటి పిలుపు లేకపోవడం, టిక్కెట్లు టిడిపి వాళ్లకే ఇచ్చామని దుష్ప్రచారం చేయడంపై పాదగయ ఈవో దుర్గభవానీని ప్రశ్నించారు. మంగళవారం పాదగయ క్షేత్రంలో క్యాడర్‌తో కలిసి పూజలు చేసిన వర్మ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆలయ అధికారుల తీరు సరిగా ఉండటం లేదన్నారు. తాము ఎటువంటి పాసులు, టిక్కెట్లు తీసుకోకపోయినా, టిడిపి వాళ్లకు 1000 టిక్కెట్లు ఇచ్చామని ప్రచారం చేశారు.కనీసం పూజలకు తమకు ఆహ్వానం లేకపోవడం దురదృష్టకరమన్నారు. తన రాజకీయ చరిత్రలో శ్రావణ మాస శుక్రవారం అమ్మవారిని దర్శించుకోకపోవడం ఇదే తొలిసారి అని వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులకు కారణం అధికారులేనని, ఇది ఎంత వరకూ సమంజసమని ఆయన ఈవోను నిలదీశారు. ఈ సందర్భంలో ఈవో తాము ఎటువంటి పాసులు టిడిపి క్యాడర్‌కు ఇవ్వలేదని బదులిచ్చారు.
కూటమిని విస్మరిస్తున్నారు..
అధికారులు సరియైన సమన్వయం చేయకపోవడం వల్ల కూటమిని విస్మరిస్తున్నారని వర్మ మండిపడ్డారు. బిజేపీ, టిడిపి, జనసేన కలిసి పనిచేయాలి. కానీ అధికారులు సొంత నిర్ణయాలతో కలవనివ్వడం లేదు. కూటమి విధానాలు అధికారులకు ప్రత్యేకంగా చెప్పాలా..అని ఆయన ప్రశ్నించారు. దీనిపై తాను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దృష్టికి సమ్యను తీసుకెళ్తానన్నారు. అధికారులు తీరు మార్చుకోవాలని వర్మ సూచించారు.