వైసీపీ అక్రమ అరెస్ట్‌ల పై చర్యలు తీసుకోండి?
తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి ముల్పూరి కళ్యాణిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి ముల్పూరి కళ్యాణిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ఈ మేరకు అక్రమ అరెస్ట్‌పై చర్యలు కోరుతూ జాతీయ మహిళా కమిషన్, ఏపీ డీజీపీకి లేఖ రాశారు. గత మూడున్నరేళ్లలో డ్రగ్స్ నేరాలకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారిందని లేఖలో ఆరోపించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగంతో పాటు మహిళలపై నేరాలు, అఘాయిత్యాలు క్రమంగా పెరుగుతున్నాయి అని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి నేరాల నియంత్రణకు బదులుగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటోంది అని విమర్శించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడి చేస్తే టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయడం దుర్మార్గం అని అన్నారు. ఈ ఘటనలో తెలుగు మహిళా నాయకురాలు ముల్పూరి కళ్యాణిని నిందితురాలిగా చేర్చడంపై మండిపడ్డారు. ఏప్రిల్ 10న గన్నవరం హనుమాన్ జంక్షన్ పోలీసులు కళ్యాణి ఇంట్లోకి చొరబడి ఆమెను బలవంతంగా తీసుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుస్తులు మార్చుకునేందుకు కూడా అనుమతించలేదని.. తమ సమక్షంలోనే దుస్తులు మార్చుకోవాలని బలవంతం చేయడం తన వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును తీవ్రంగా ఉల్లంఘించడమేనని వంగలపూడి అనిత లేఖలో తెలిపారు. వైసీపీ ప్రభుత్వం, పోలీసులు మహిళలపై నేరాలు కట్టడి చేసే బదులు ప్రతిపక్ష టీడీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోసుకుంటున్నారు అని ఆరోపించారు. దీనిపై రాష్ట్ర డిజిపికి అనేకసార్లు పిర్యాదు చేసినప్పటికీ ఆయన నుండి ఎటువంటి స్పందన లేదన్నారు. ఈ నేపథ్యంలో కళ్యాణి అక్రమంగా అరెస్టు ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని.. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వంగలపూడి అనిత జాతీయ మహిళా కమిషన్, ఏపీ డీజీపీని లేఖలో కోరారు.