జీహెచ్ఎంసీలో రిటైర్డ్ ఆఫీసర్ల లిస్ట్ చూసి కమిషనర్ షాక్!
రిటైర్డ్ అయినా.. ఇంకా జీహెచ్ఎంసీలో ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్న వారి లిస్ట్ చూసి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ షాక్ అయ్యారు.
దిశ, సిటీ బ్యూరో: రిటైర్డ్ అయినా.. ఇంకా జీహెచ్ఎంసీలో ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్న వారి లిస్ట్ చూసి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ షాక్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీలో ఖాళీలు, రిటైర్డ్ అయినా ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలను సేకరించారు. ఇందులో జీహెచ్ఎంసీలో మొత్తం 43 మంది రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నట్లు తేలింది. అంతేకాకుండా ఆరుగులు మెడికల్ ఆఫీసర్లు, మరి కొందరు డిప్యూటీ కమిషనర్లు, సిబ్బంది డిప్యూటేషన్ పై వచ్చి జీహెచ్ఎంసీలో వచ్చి తిష్ట చేసినట్లు గుర్తించారు.
అదనపు కమిషనర్ (ఫైనాన్స్), ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (హౌసింగ్), సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), ఓఎస్డీ టు మేయర్, అదనపు కమిషనర్ (కమాండ్ కంట్రోల్) హోదాల్లో కనిష్టంగా అయిదేళ్లు, గరిష్టంగా పదిహేనేళ్ల నుంచి జీహెచ్ఎంసీలో సీటు వదలకుండా కొనసాగుతున్నట్లు కమిషనర్ సర్కారుకు నివేదిక అందజేసినట్లు సమాచారం. వీరికి నెలకు లక్షల్లో జీతం, కారు, సెల్ ఫోన్, ఇంటర్నెట్ అలవెన్సులతో పాటు చాంబర్ రీక్రియేషన్ చార్జీల పేరుతో జీహెచ్ఎంసీకి రూ.2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు భారం పడుతున్నట్లు అంచనా.