YS Jagan Mohan Reddy: రైతులందరికీ భూ హక్కు పత్రాలు
అసాధ్యమని గత ప్రభుత్వాలు చేతులెత్తేసిన భూముల రీ సర్వే కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు...
- భూముల రీ సర్వేతో రైతులకు ఎంతో ఉపయోగకరం
- అసాధ్యమనుకున్న సర్వేను వందేళ్ల తర్వాత చేపడుతున్నాం
- ఇకపై సివిల్ వివాదాలకు చెక్
- 2023 చివరి నాటికి రీ సర్వే పూర్తి
- నరసన్నపేట బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్
దిశ, డైనమిక్ బ్యూరో: అసాధ్యమని గత ప్రభుత్వాలు చేతులెత్తేసిన భూముల రీ సర్వే కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Cm Ys Jagan) స్పష్టం చేశారు. దాదాపు 100 ఏళ్ల తర్వాత ఈ రీ సర్వే జరగబోతుందని ఆయన వెల్లడించారు. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ప్రతి కమతానికి నెంబర్ ఇవ్వనున్నట్లు జగన్ ప్రకటించారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష(రీ సర్వే) పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని వైఎస్ జగన్ బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించారు. ఈ సందర్భంగా భూ హక్కు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. అంతకు ముందు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం జగన్ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నరసన్నపేటకు చేరుకున్నారు. సీఎం జగన్‌కు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఘన స్వాగతం పలికారు. ఇక సభా వేదిక వద్ద సర్వే స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు, సర్వేయర్లతో సీఎం వైఎస్ జగన్ ముచ్చటించారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ కీలక ప్రసంగం చేశారు.
రైతులకు ఎంతో ఉపయోగం
రాష్ట్రంలో భూ వివాదాలన్నింటికి చెక్ పెట్టాలన్నదే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. భూమి కలిగిన ప్రతీ ఒక్కరికీ శాశ్వత హక్కుదారు ఇచ్చేలా పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. హద్దు రాళ్లు కూడా పాతి రైతులకు భూహక్కు పత్రం ఇవ్వబోతున్నట్లు తెలిపారు. సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని.. ఆ పరిస్థితులు మార్చాలని ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఆగస్ట్ 2023 కల్లా 9 వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2023 చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఈ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష కార్యక్రమంలో భాగంగా సమగ్ర సర్వే పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80 శాతం నుంచి 90 శాతం సివిల్ కేసులు భూములకు సంబంధించినవే ఉన్నాయని.. అయితే రికార్డులు సరిగా లేకపోవడం, మ్యూటేషన్ సరిగా లేకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ పథకం అమలు వల్ల సివిల్ వివాదాలు చెక్ పెట్టవచ్చని భావించి ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
ఫిబ్రవరిలో రెండోదశ సర్వే
భూ సర్వే రికార్డుల ప్రక్షాళన రెండేళ్ల కిందట మొదలైందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రైతులందరికీ వారి భూ హక్కు పత్రాలు అందిస్తామన్నారు. దాదాపు 2 వేల రెవెన్యూ గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన జరిగిందని 7 లక్షల 92 వేల 238 మంది రైతులకు భూ హక్కు పత్రాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఫిబ్రవరిలో రెండో దశలో 4 వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేసి మే 2023 కల్లా 6వేల గ్రామాల్లో భూ హక్కు పత్రాలు పంపిణీ చేయబోతున్నట్లు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.
Read More : Ycp ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్ చోరీ