జైల్లో చంద్రబాబుకు స్పెషల్ ట్రీట్‌మెంట్.. జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు

రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న

Update: 2023-10-12 15:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటీడీపీ అధినేత చంద్రబాబుకు చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్యుల బృందాన్ని ప్రభుత్వం కేటాయించింది. రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్‌లోని డెర్మటాలజీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఇద్దరు వైద్యుల బృందాన్ని కేటాయించింది. ఈ మేరకు రాజమండి ప్రభుత్వ ఆస్పత్రి సూపరిటెండెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బృందంలో డెర్మటాలజీ విభాగానికి చెందిన ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారు.

జైల్లో చంద్రబాబు తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. ఇటీవల ఎండ తీవ్రత వల్ల డీహైడ్రేషన్‌కు గురి కావడంతో ఆసుపత్రిలోని వైద్యులు పరీక్షించారు. అయితే ఎండలు, ఉక్కబోత వల్ల చంద్రబాబు స్కిన్ అలర్జీ బారిన పడ్డారు. దీంతో చంద్రబాబును పరీక్షించడం, చికిత్స అందించడం కోసం స్పెషల్ డాక్టర్ల టీమ్‌ను ప్రభుత్వం నియమించింది. చంద్రబాబు అస్వస్థతకు సంబంధించి ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులకు జైలు సిబ్బంది సమాచారం అందించారు. జైలు అధికారుల సమాచారంతో రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరిటెండెంట్ స్పందించారు. చంద్రబాబు వద్దకు వైద్య సిబ్బందిని పంపించగా.. కాళ్లు, చేతులు పరిశీలించారు.

కాగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 33 రోజులుగా చంద్రబాబు జైల్లో ఉంటున్నారు. బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఏసీబీ కోర్టును ఆశ్రయించగా.. అక్కడ చుక్కెదురైంది. దీంతో హైకోర్టును చంద్రబాబు తరపు లాయర్లు ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్‌పై విచారణ 17వ తేదీకి వాయిదా పడింది. అటు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది. ఇప్పటికే దాదాపు వాదనలు ముగియడంతో రేపు తీర్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Similar News