తిరుమల లడ్డూ కల్తీపై పగడ్బందీగా సిట్ దర్యాప్తు.. అరెస్టులు తప్పవా..?
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ (Tirumala Laddu) ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (SIT) ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. సర్వశ్రేష్ఠ త్రిపాఠి (Sarvasreshta Tripathi) ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం అన్ని వైపుల నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. మొత్తం మూడు బృందాలుగా విడిపోయి దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇందులో ఓ టీం తమిళనాడులోని ఏఆర్ డెయిరీకి వెళ్లనుంది. మరో టీం ల్యాబ్ రిపోర్టు (Lab Reports)లను పరిశీలించనుంది. ఇక మూడో టీం ఈ రోజు (సోమవారం) తిరుమల ఆలయంలో పర్యటించింది.
ఉదయం తిరుమల లడ్డూ పోటు, నైవేద్యం పోటు, అన్నదాన పోటులను సిట్ అధికారులు పరిశీలించారు. అలాగే అసలు నెయ్యిని ప్రొక్యూర్ చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యులుగా ఎవరెవరున్నారు..? నెయ్యి (Ghee)ని ఏ నిష్పత్తిలో కొనుగోలు చేశారనే అంశాలపై డాక్యుమెంట్లు పరిశీలించింది. ఈ నేపథ్యంలోనే గత టీటీడీ పాలక మండలి తమిళనాడుకు (Tamilnadu) చెందిన ఏఆర్ డెయిరీ (AR Dairy)తో 10 లక్షల కేజీల నెయ్యిని సరఫరా చేసేందుకు ఒప్పందం (Deal) కుదుర్చుకుందని గుర్తించి.. ఈ ఒప్పంద సమయంలో సదరు కంపెనీ టెండర్లకు అనుకూలంగా వ్యవహరించిందా? లేదా? అనే విషయాన్ని ఆరా తీసింది. అలాగే ఇప్పటివరకు అందులో ఎంత నెయ్యి టీటీడీ (TTD)కి చేరిందనే అంశంపై కూడా పరిశీలన జరిపింది.
ఇదిలా ఉంటే టీటీడీ ఈవో జే శ్యామలరావు (TTD EO J. Syamalarao) చెబుతున్న దాని ప్రకారం.. జూన్‌లో 10 ట్యాంకర్ల నెయ్యి తిరుమలకు చేరుకోగా, అందులో 6 ట్యాకర్ల నెయ్యి వినియోగించారు. కానీ మిగిలిన నాలుగింటిలో జంతువుల కొవ్వు (Animal Fat) కలిసినట్టు రిపోర్టులో కనిపించడంతో వాటిని తిరిగి పంపడమే కాకుండా.. ల్యాబ్ రిపోర్టు ప్రకారం ఏఆర్ డెయిరీని బ్లాక్ లిస్టులో పెట్డడం జరిగింది. దాని స్థానంలో తాజాగా నందిని డెయిరీ (Nandini Dairy)కి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది.
ఇదిలా ఉంటే మరో ఏఆర్ డెయిరీకి వెళ్లనున్న మరో టీం.. అక్కడి డెయిరీలో ఎవరెవరు పార్ట్‌నర్లుగా ఉన్నారు..? నెయ్యి విషయంలో ఏఆర్ డెయిరీకి ఎవరైనా సబ్ కాంట్రాక్టర్ ఉన్నారా..? అసలు ఏడాదికి ఏఆర్ డెయిరీ ఏడాది టర్నోవర్ ఎంత..? టెండర్ నిబంధనలకు అనుగుణంగా కంపెనీ పనిచేస్తుందా..? లేదా..? అనే విషయాలపై కూలంకషంగా చర్చించనుంది.
ఇదంతా ఓ ఎత్తయితే ఈ నెయ్యి కల్తీ విషయంపై మరింత విచారణ కొనసాగించే క్రమంలో గత పాలక మండలిలో కీలకంగా పనిచేసిన కొంతమంది అధికారులను సైతం అరెస్ట్ (Arrest) చేసే అవకాశాలున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే లడ్డూ కల్తీ వ్యవహారం కేసు కీలక మలుపు తిరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతుంది.