ఇకపై నో పోటీ.. స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన నిర్ణయం

టీడీపీ సీనియర్ నేత, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు..

Update: 2024-09-22 11:46 GMT

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ సీనియర్ నేత, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు (Speaker Chinthakayala ayyanna Patrudu) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆయన నిశ్చయించుకున్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన చేశారు. తన నియోజకవర్గంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ ఇవే తన చివరి ఎన్నికలని చెప్పారు. అనకాపల్లి జిల్లా (Anakapalle district) నర్సీపట్నం (Narsipatnam) నుంచి అయ్యన్న పాత్రుడు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నర్సీపట్నం అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం స్పీకర్‌గా ప్రజలకు అయ్యన్న సేవ చేస్తున్నారు.

అయితే అయ్యన్నపాత్రుడు తనయుడు చింతకాయల విజయ్ (Chintakayala Vijay) టీడీపీ (Tdp)లో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా.. కుటుంబంలో ఒకరికే సీటు విధానంలో ఆయన అవకాశం రాలేదు. దీంతో తండ్రి అయ్యన్న పాత్రుడే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాల్సి వచ్చింది. వయసురీత్యా అయ్యన్న పాత్రుడు సీనియర్ కావడంతో ఈసారి ఎన్నికల్లో తన కుమారుడు విజయ్‌ను నర్సీపట్నం నుంచి బరిలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నారు. ఇందులో భాగంగా తన తర్వాత వారసుడిని రంగప్రవేశం చేయించనున్నారు. దీంతో ఇకపై ఎన్నికల్లో పోటీ చేయకూడదని అయ్యన్నపాత్రుడు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఆయన వెల్లడించారు. ఈ ఐదేళ్లు ప్రజా సేవ చేస్తానని చెప్పారు. ఐదేళ్ల తర్వాత తనకు 73 సంవత్సరాలు వస్తాయని, ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తనకు ఓపిక ఉన్నంత వరకూ ప్రజా సేవ చేస్తానని అయ్యన్న తెలిపారు.


Similar News