ఆన్ లైన్ గేమ్స్‌కు బానిసైన కొడుకు...కుటుంబం ఆత్మహత్యాయత్నం

ఆన్ లైన్ గేమింగ్‌ ఓ ప్రాణం బలితీసుకుంది. ఆన్ లైన్ గేమింగ్‌కు బానిసైన కొడుకును మార్చేందుకు తల్లిదండ్రులు ఎంతో ప్రయత్నించారు.

Update: 2023-08-25 12:49 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఆన్ లైన్ గేమింగ్‌ ఓ ప్రాణం బలితీసుకుంది. ఆన్ లైన్ గేమింగ్‌కు బానిసైన కొడుకును మార్చేందుకు తల్లిదండ్రులు ఎంతో ప్రయత్నించారు. కానీ అతడిలో మార్పురాకపోగా విపరీతంగా అప్పులు చేశారు. అయితే ఆ అప్పులు తీర్చడం కష్టమని భావించిన తండ్రి కుటుంబంతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కల్లూరి సత్యనారాయణ(51), సూర్యకుమారి దంపతులకు సంతోష్ కుమార్, నీలిమ(21) సంతానం. కుటుంబంతో కలిసి సత్యనారాయణ పెందుర్తిలో నివాసం ఉంటున్నాడు. అయితే సంతోష్ కుమార్ అనే వ్యక్తి ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డాడు. ఆన్‌లైన్ గేమ్స్ ఆడి ఆడి తీవ్రంగా అప్పులపాలయ్యాడు. తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు సరికదా.. మరింతగా అప్పులు పెంచాడు. కొడుకు ప్రవర్తన మారకపోగా.. అప్పులు పెరగడంతో తీర్చే మార్గం కూడా కనిపించలేదు. దీంతో సత్యనారాయణ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. గురువారం రాత్రి భార్య, కుమార్తెలతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే సంతోష్ కుమార్ ఇంటికి వచ్చి చూసే సరికి తల్లిదండ్రులు, సోదరి అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించారు. స్థానికుల సహాయంతో కేజీహెచ్‌కు తరలించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కల్లూరి సత్యనారాయణ మృతి చెందాడు. భార్య సూర్యకుమారి(45), కూతురు నీలిమ (21) పరిస్థితి విషమంగా ఉంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.


Similar News