AP News: రాష్ట్రంలో ఏరులై పారుతున్న కర్ణాటక మద్యం.. అధికారులు పరేషాన్
ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో కర్ణాటక మద్యం ఏరులై పారుతోంది.
దిశ ప్రతినిధి, చిత్తూరు.: ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో కర్ణాటక మద్యం ఏరులై పారుతోంది. చిత్తూరు జిల్లాకు సరిహద్దుల్లో ఉన్న కర్ణాటకకు చెందిన మద్యం షాపుల నుంచే ఈ అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం. రవాణాకు అణువుగా ఉన్న టెట్రా ప్యాక్ మద్యం ఎక్కడ చూసినా ప్రత్యక్షమవుతోంది.
జిల్లాలోని ఏ పార్టీ కార్యకర్తలు చూసిన కర్ణాటకకు చెందిన ఈ టెట్రా ప్యాక్ మద్యాన్నే సేవిస్తూ కనిపిస్తున్నారు. సేవించడమే కాకుండా స్పేర్‌గా జేబుల్లో పెట్టుకుని బహిరంగంగా తిరుగుతున్నారు. అయినా చర్యలు తీసుకోవలసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు గానీ, స్థానిక పోలీసులుగాని పట్టించుకున్న పాపాన లేరు.
పైగా వారి కళ్ళ ముందే కర్ణాటక మధ్యాన్ని ఆయా పార్టీల కార్యకర్తలు జేబుల్లో పెట్టుకుని తిరుగుతున్న అది తమ డ్యూటీ కాదనే విధంగా వ్యవహరించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అధికారులు పట్టీపట్టనట్టు ఉండడంతో ప్రస్తుతం అన్ని పార్టీలకు చెందిన కార్యకర్తల్లో చాలామంది ఉదయం లేచింది మొదలు నిద్రపోయేంతవరకు ఈ మద్యాన్నే తాగుతూ, చేతుల్లో పట్టుకుని తిరుగుతున్నారు.
మామూలుగా అయితే ఒక క్వార్టర్ బాటిల్ అనేది ప్లాస్టిక్ బాటిల్ లేదా గాజు బాటిల్ అయితే జేబులో పెట్టుకోవాలంటే కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే కర్ణాటక నుంచి అక్రమంగా రవాణా అయిన ఈ టెట్రా ప్యాక్ మద్యం మాజా (మ్యాంగో జ్యూస్ నింపిన టెట్రా ప్యాక్ ప్యాకెట్) లాగా ఉండడంతో జేబులో పెట్టుకుని అవసరమైనప్పుడు వాడుకునేందుకు వీలుగా ఉంది. అలానే ఆయా పార్టీల నాయకులు ఎక్కడైనా దాచడానికి గాని పంపిణీ చేయడానికి గాని చాలా సులువుగా ఉంటోంది.
చెక్ పోస్టుల్లోనే అవినీతి..
చిత్తూరు జిల్లాకు దాదాపు దక్షిణ, పడమర ప్రాంతాల్లో కర్ణాటక సరిహద్దు ప్రాంతం ఉంది. దానికి తోడు సరిహద్దు ప్రాంతాల్లో కర్ణాటక మద్యం షాపులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అంతేకాకుండా మన రాష్ట్రంతో పోలిస్తే కర్ణాటకలో లోక్వాలిటీ మద్యం తక్కువ ధరల్లో లభిస్తోంది. అంతేకాకుండా పలు కంపెనీలకు చెందిన టెట్రా ప్యాక్ మద్యం కర్ణాటకలోనే లభిస్తోంది.
అందువల్ల ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అన్ని పార్టీలు ఓటర్లకు పంపిణీ చేసేందుకు విధిగా మద్యం అవసరం. అందువల్ల ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కర్ణాటక నుంచి పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి జిల్లాకు అక్రమంగా తరలిస్తున్నారు. అయితే మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు, సరిహద్దుల్లో ఉండే ఎక్సైజ్ ఇతర శాఖల అధికారులతో పాటు ప్రత్యేకంగా ఎన్నికల చెక్పోస్టులను సరిహద్దు ప్రాంతాల్లోప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ప్రత్యేకంగా ఎన్నికలలో అవసరమైన డబ్బు, మద్యం తోపాటు ఓటర్లను ప్రలోభ పెట్టే ఇతర వస్తువుల రవాణాను అరికట్టడమే ఈ చెక్ పోస్టుల లక్ష్యం. దీనితో ఈ చెక్ పోస్టులు డ్యూటీలో నిపుణులు, నిజాయితీగా పనిచేసే అధికారులనే ఏరి కోరి ప్రభుత్వం నియమించింది. అయితే వారిలోనూ స్వార్థం ఆవహించడంతో కర్ణాటక మద్యం జిల్లాకు బాక్సులు బాక్సులుగా అక్రమ రవాణా అవుతోంది.
ముందుగా చెక్పోస్టుల్లో ఉండే అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపుల నుంచి కేసులు కేసులుగా ఈ టెట్రా ప్యాక్ మద్యాన్ని కొనుగోలు చేసి జిల్లాకు తరలిస్తున్నారు. దీనితో మంచి మంచి అనుకుంటే మంచం అంత కంతలు చేశారు అన్నట్టు ప్రత్యేక చెక్ పోస్ట్ సిబ్బంది తీరు ఉందని స్థానిక మహిళలు వాపోతున్నారు.
పలమనేరే ముఖద్వారంగా...
కర్ణాటక రాష్ట్రంలో కొనుగోలు చేసిన మద్యాన్ని పలమనేరు నియోజకవర్గం పరిధిలోని పలు మార్గాల ద్వారా అడ్డదారిలో అక్రమంగా జిల్లాకు చేర్చుతున్నారు. ముఖ్యంగా పలమనేరు క్యాటిల్ ఫామ్, గంగవరం లోని నాలుగు రోడ్లు, రూరల్ మండలంలోని పలు అడ్డరోడ్లు, పెద్ద పంజాన్ని మండలంలోని సరిహద్దు ప్రాంతాల్లోని పల్లెల ద్వారా అక్రమ మార్గాల్లో జిల్లాకు మద్యం చేరుతోంది.
దీనివల్ల ఎన్నికల నిబంధనలకు తిలోదకాలు వదలడమే కాకుండా కోట్లాది రూపాయల అక్రమ మద్యం కోసం జిల్లాలోని పలు పార్టీలు ఖర్చు చేసే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారాల్లో కార్యకర్తలు పాల్గొనాలంటే మద్యం పంపిణీ కచ్చితంగా జరగాల్సిందే. కాబట్టి ఏ పార్టీ అభ్యర్థులైన మధ్యాన్ని విధిగా కొనుగోలు చేయాల్సిందే.
అయితే మన రాష్ట్రంలో ఎన్నికల అవసరాల కోసం సరిపడే మధ్యాన్ని ప్రభుత్వ మద్యం షాపుల్లో కొనుగోలు చేయడం సాధ్యపడటం లేదు. దాంతో అన్ని పార్టీల నాయకులు అడ్డదారుల్లో కర్ణాటక నుంచి తెప్పించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.