శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు.

Update: 2023-11-10 11:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, అభిషేకం జరిపారు. అనంతరం నాలుగుమాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం జరిపి, ధ్వజ స్థంభ తిరుమంజనం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గరుత్మంతుని చిత్రం ఉన్న ధ్వజ పటాన్ని ఆరోహణం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, జేఈవో సదా భార్గవి, జేఈవో వీరబ్రహ్మం దంపతులు, డిప్యూటీ ఈవో గోవింద రాజన్, విజివో బాలిరెడ్డి, ఉద్యాన విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు,పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీనివాసా చార్యులు, కంకణ భట్టార్, మణికంఠ స్వామి, అర్చకులు బాబు స్వామి, వేంపల్లి శ్రీను స్వామి పాల్గొన్నారు. అనంతరం ఈవో ఎవి ధర్మారెడ్డి జేఈవోలతో కలసి శుక్రవారపు తోటలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన, శిల్పకళా శాల ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శన, తిరుమల -తిరుపతి స్పిరుచువల్ సొసైటీ ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన శాలను ప్రారంభించారు.

ప్రతి భక్తుడికి దర్శనం కల్పిస్తాం

ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మాడ వీధుల్లో ఉండే ప్రతి భక్తుడికి వాహన సేవ దర్శనం కల్పిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ మూల మూర్తి దర్శనం చేయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గజ వాహన సేవ, పంచమీ తీర్థం కు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని, ఇందుకు అవసరమైన భద్రత, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పుకొచ్చారు. శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన బాగా ఉందని, బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులతో పాటు స్థానికులు కూడా సందర్శించాలని ఈవో కోరారు. ఈ సందర్భంగా చెన్నై కు చెందిన హిందూ మహాసభ ట్రస్ట్ చైర్మన్ డి.ఎల్ వసంత కుమార్ తదితరులు అమ్మవారికి ఆరు గొడుగులను కానుకగా అందించారు. ఇదిలా ఉండగా రాత్రి 7నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు చిన్న శేష వాహనంపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 

Tags:    

Similar News