AP:క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి శాప్ కృషి.. శాప్ ఛైర్మన్ కీలక ప్రకటన
క్రీడాకారులతోపాటు ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతాల్లో క్రీడాప్రాంగణాలను అభివృద్ధి చేసేందుకు ఏపీ క్రీడాప్రాధికార సంస్థ కృషి చేస్తుందని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు.
దిశ,వెబ్‌డెస్క్: క్రీడాకారులతోపాటు ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతాల్లో క్రీడాప్రాంగణాలను అభివృద్ధి చేసేందుకు ఏపీ క్రీడాప్రాధికార సంస్థ కృషి చేస్తుందని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. విజయవాడ 4వ డివిజన్ పరిధిలోనున్న వెటర్నరీ కాలనీలో శిథిలావస్థకు చేరిన యూత్ హాస్టల్ భవనాన్ని స్థానిక వెటర్నరీ కాలనీ రెసిడెన్సియల్ అసోసియేషన్ సభ్యులతో కలిసి రవినాయుడు నేడు(శనివారం) పరిశీలించారు. యూత్ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరడం కారణంగా అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డగా మారిందని, అలాగే ఆ ప్రాంగణమంతా నిరుపయోగంగా మారిందని అసోసియేషన్ సభ్యులు శాప్ ఛైర్మన్ గారికి వివరించారు. స్థానికులతోపాటు క్రీడాకారులందరికీ ఉపయోగంగా ఉండేలా యూత్ హాస్టల్ భవనాన్ని కూల్చివేసి ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని శాప్ ఛైర్మన్ గారిని అసోసియేషన్ సభ్యులు కోరారు.
ఈ సందర్భంగా శాప్ ఛైర్మన్ మాట్లాడుతూ.. స్థానికులకు, అసోసియేషన్ సభ్యులకు ఆమోదయోగ్యమైతే శాప్ ఆధ్వర్యంలో క్రీడాప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. విద్యార్థులకు, యువతకు, క్రీడాకారులకు ఉపయోగకరంగా మల్టీపర్పస్ ఇండోర్ హాలు, స్పోర్ట్స్ రెసిడెన్సియల్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చర్చించారు. దీనికి సంబంధించి తొలుత యూత్ హాస్టల్ స్థలం ఎవరి పరిధిలో ఉందో తెలుసుకుని సంబంధిత అధికారులతో MOU చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే ఆ స్థలాన్ని శాప్ ఆధీనంలోకి తీసుకుని శాప్ సహకారంతో అందరికీ ప్రయోజనకరంగా మల్టీపర్పస్ ఇండోర్ హాలు, స్పోర్ట్స్ రెసిడెన్సియల్ సెంటర్లను ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు గారు, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్(చిన్ని) గారి సహకారంతో యూత్ హాస్టల్ ప్రాంగణాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని రవినాయుడు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, కాలనీ ప్రెసిడెంట్ నల్లూరి సుబ్బారావు, ఆంజనేయులు, చిరుగుపాటి యుగంధర్, సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.