సానుభూతి అస్త్రం: ప్రజల్లోకి నారా భువనేశ్వరి, బ్రహ్మణి.. వైసీపీ బాటలోనే
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రహ్మణిలు రోడ్డెక్కబోతున్నారా?
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రహ్మణిలు రోడ్డెక్కబోతున్నారా? చంద్రబాబు నాయుడు జైలులో ఉన్న నేపథ్యంలో అరెస్ట్, రిమాండ్ తదితర అంశాలను ప్రజల్లోకి వివరించేందుకు రెడీ అవుతున్నారా? చంద్రబాబు అరెస్ట్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సందర్భంలో దాన్ని క్యాష్ చేసుకునేందుకు టీడీపీ అధిష్టానం భువనేశ్వరి, బ్రహ్మణిలను రంగంలోకి దించనుందా? ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబుపై విపరీతమైన సానుభూతి పెరిగిన నేపథ్యంలో దాన్ని క్యాష్ చేసుకోవాలనే వ్యూహంలో భాగంగా నారావారి నారీమణులు రోడ్డెక్కబోతున్నారా? వైఎస్ జగన్ జైలుకు వెళ్లినప్పుడు ఎలా అయితే తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిలలు ఎలా అయితే రంగంలోకి దిగారో అదే బాటలో ఇప్పుడు భువనేశ్వరి, బ్రహ్మణి పయనించబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలోనే భువనేశ్వరి, బ్రహ్మణిలు ప్రజల్లోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది. అధికార పార్టీ అక్రమ అరెస్టులను నిరసిస్తూ న్యాయం కోసం ప్రజల్లోకి నారా భువనేశ్వరి, బ్రహ్మణిలు వెళ్లబోతున్నారని తెలుస్తోంది.
సానుభూతి అస్త్రం
ఆంధ్రప్రదేశ్‌లో మరో ఏడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో క్షణం క్షణం రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకప్పుడు ఓటర్ల నాడి పట్టుకునేందుకు పోటీపడే నాయకులు ఇప్పుడు సెంటిమెంట్ రాజకీయాలతో ఓటర్ల దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాల్లో సానుభూతిని మించిన అస్త్రం ఏదీ ఉండదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వైఎస్ మరణించిన తర్వాత ప్రజల్లో ఆ కుటుంబం పట్ల సానుభూతి వెల్లువలా వచ్చింది. వైఎస్ జగన్ జైలుకు వెళ్లిన తర్వాత కూడా అదే సానుభూతి మరింత పెరిగింది. ఇప్పుడు అదే సానుభూతిని అస్త్రంగా చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. గతంలో వైఎస్ జగన్ జైలుకు వెళ్లినప్పుడు వైసీపీ బాధ్యతలను వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల భుజాన ఎత్తుకున్నారు. ఇప్పుడు అదే బాటలో టీడీపీ పయనిస్తున్నట్లు తెలుస్తోంది. స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం చంద్రబాబు జైలులో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని.. కక్ష సాధింపు చర్యలకు వైసీపీ ప్రభుత్వం పడుతుందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇదే సందర్భంలో రాష్ట్రంలోని వైసీపీ, బీజేపీ మినహా మిగిలిన అన్ని పార్టీలు చంద్రబాబుకు మద్దతుగా నిలిచాయి. జాతీయ స్థాయి నేతలు సైతం చంద్రబాబు కుటుంబానికి మద్దతు ప్రకటించాయి. ఇదే తరుణంలో లోకేశ్ నడిరోడ్డుపై కూర్చోవడం...చంద్రబాబుకు కంటిమీద కునుకు లేకుండా ఒకవైపు విచారణ మరోవైపు కోర్టు విచారణతో ఇబ్బందులు పెట్టారన్న విషయం ప్రజల్లోకి వెళ్లింది. ఇంత వయసులో ఇలాంటి కక్ష సాధింపు చర్యలు సబబు కాదనే అభిప్రాయాన్ని సామాన్యుడు సైతం అభిప్రాయపడుతున్నారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాన్ని ప్రతీ ఒక్కరూ తలచుకుంటున్నారు. చంద్రబాబు పులిలా బతికారని అభిప్రాయపడుతున్నారు. అలాంటి వ్యక్తికి ఎంత కష్టం వచ్చిందని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
విజయమ్మ, షర్మిల బాటలోనే భువనేశ్వరి, బ్రహ్మణిలు
అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ 16 నెలలపాటు జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తన కొడుకును తన సోదరుడిని అన్యాయంగా జైలుకు పంపించారని అటు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలలు ప్రజల్లోకి వెళ్లారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని అభ్యర్థించారు. ఇదే సెంటిమెంట్ 2019 వరకు కొనసాగించారు. దీంతో ప్రజల్లో సానుభూతి పెరిగింది. అది ఓట్ల రూపంలో కురిసింది. వైఎస్ జగన్ లక్షల కోట్లు అక్రమంగా సంపాదించారనే టీడీపీ ఆరోపణలు పసలేనివిగా మారిపోయాయి. అంతే ఎలక్షన్లు వచ్చాయి. బాక్సులు పగిలిపోయేలా ఓటర్లు వైసీపీకి ఏకపక్షంగా పట్టం కట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలోనూ అదే పంథాను టీడీపీ అవలంభించబోతుందని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ నారా భువనేశ్వరి, బ్రహ్మణిలు రోడ్డెక్కనున్నారు. తమ కుటుంబాలను అక్రమ కేసులో వేధిస్తున్నారని తమకు న్యాయం చేయాలని వేడుకోబోతున్నారు. ప్రజలకు సేవ చేయడంలో తన తండ్రి దివంగత ఎన్టీఆర్, తన భర్త చంద్రబాబు నాయుడు, తనయుడు నారా లోకేశ్‌లు ముందు వరుసలో ఉంటారని భువనేశ్వరి చెప్పనున్నారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం కష్టపడుతున్న చంద్రబాబు, లోకేష్ పై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని, వారిని తప్పుడు కేసులో ఇరికించి వేధిస్తోందని ప్రజలకు వివరించనున్నారు. తమ కుటుంబ సభ్యుల రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అని ఎలాంటి అన్యాయాలు, అక్రమాలు తమకు తెలియవని చెప్పనున్నారు. తమ కుటుంబాన్ని రాజకీయంగా అణగదొక్కాలని... ప్రతిపక్ష పార్టీలనేవి లేకుండా చేయాలనే దుర్మార్గపు ఆలోచనతో వైసీపీ ముందుకు వెళ్తుందని భువనేశ్వరి, బ్రహ్మణిలు ప్రజలకు వివరించనున్నారని తెలుస్తోంది. ఈ దిశగా టీడీపీ అధిష్టానం యోచన చేస్తోందని తెలుస్తోంది.
ఇప్పటికే భువనేశ్వరిపై సాఫ్ట్ కార్నర్
ఇకపోతే నారా భువనేశ్వరి, బ్రహ్మణిలు రోడ్డెక్కితే రాజకీయం వేరుగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అన్న నందమూరి తారక రామారావు కుమార్తెగా భువనేశ్వరికి ఇప్పటికే గుర్తింపు ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు సతీమణిగా కూడా మంచి గుర్తింపు ఉంది. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా సేవలందిస్తూ ఎందరో మనసులకు అత్యంత దగ్గరయ్యారు భువనేశ్వరి. రాజకీయాల్లో అంతగా ప్రత్యక్షంగా పాల్గొనని భువనేశ్వరి గత ఏడాది నుంచి వార్తల్లో నిలుస్తున్నారు. నిండు అసెంబ్లీలో భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన చంద్రబాబు అసెంబ్లీలో అడుగు పెట్టనని శపథం చేశారు. అంతే టీడీపీ కేంద్ర కార్యాలయంలోకి వచ్చి బోరున విలపించారు. రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ అయిన చంద్రబాబు మైకుల ముందు కన్నీటి పర్యంతం అవ్వడం అందర్నీ కలచివేసింది. అదే సందర్భంలో భువనేశ్వరిని ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన విమర్శల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. నందమూరి ఫ్యామిలీ ఏకంగా స్ట్రాంగ్ వార్నింగ్ సైతం ఇచ్చింది. అప్పటి నుంచి ప్రజల్లో భువనేశ్వరిపై ఓ సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇప్పుడు భువనేశ్వరి తన భర్త, కుమారుడిని వైసీపీ ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తే సెంటిమెంట్‌గా వర్కౌట్ అవుతుందని టీడీపీ భావిస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత లేకపోయినప్పటికీ జగన్ ఒక్క ఛాన్స్ అని అడగడంతో ప్రజలు ఇచ్చారని, అదే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండటంతోపాటు ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసి వేధిస్తున్నారంటూ వారి కుటుంబ సభ్యులు రోడ్డెక్కితే సానుభూతి వెల్లువలా వస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మీడియాతో మాట్లాడనున్న భువనేశ్వరి
ములాఖత్‌లో భాగంగా నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడును కలిసిన అనంతరం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద మీడియాతో మాట్లాడతారనే ప్రచారం జరుగుతుంది. తన భర్త జైల్లో పడుతున్న ఇబ్బందులను... భర్త అనారోగ్యం.... జైలులో భద్రత వంటి అంశాలను మీడియా సాక్షిగా భువనేశ్వరి వివరిస్తారని తెలుస్తోంది. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై భువనేశ్వరి , బ్రహ్మణిల పోరుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బ్రహ్మణి బిజినెస్ ఉమెన్. బిజినెస్ పరంగా చాలా బిజీ. అయితే ఆమె ఇందుకు సమయం కేటాయిస్తారా? అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రజల్లోకి భువనేశ్వరి, బ్రహ్మణి ఇద్దరూ వెళ్తారా? లేక ఒకరే వెళ్తారా? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ యోచిస్తున్నఈ సానుభూతి అస్త్రం ఎంతమేరకు వర్కౌట్ అవుతుందనేది వేచి చూడాలి.