చంద్రబాబు చెప్పుల్లో జగన్​ పాదాలు

రాజ్యాంగం ద్వారా స్థానిక సంస్థలకు సంక్రమించిన విధులు, అధికారాలను టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు కాలరాశాయి.

Update: 2023-04-09 03:14 GMT

ప్రస్తుత ప్రభుత్వ తీరు గురించి ఏమనుకుంటున్నారని తటస్థంగా ఉండే వాళ్ళని అడిగితే.. ఏముంది! చంద్రబాబు చెప్పుల్లో జగన్​పాదాలు.. అంటూ ఠక్కున చెప్పేశారు. అక్కడ నుంచి అనేక పోలికలు, విభిన్నంగా ఉండే అంశాల గురించి ప్రస్తావిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య ఓట్ల తేడా సుమారు పది శాతం ఉంది. మొత్తం ఓటర్లలో ఓ ఐదు శాతం తటస్థులు ఉంటారు. ఎన్నికల సమయం నాటికి ఎవరు బెటరనిపిస్తే ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతుంటారు. వీళ్లే ప్రధాన పార్టీల గెలుపోటములను ప్రభావితం చేస్తుంటారు. ప్రస్తుతం తటస్థులు జగన్​సర్కారుపై పెదవి విరుస్తున్నారు. ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా లేదంటున్నారు. గత ప్రభుత్వం కన్నా కొన్ని అంశాల్లోనే మెరుగ్గా ఉన్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు, జగన్​పోకడలు, విధానాలపై పోల్చుకుంటున్నారు. ఎన్నికల నాటికి తటస్థులు ఎటువైపు జై కొడతారనే దానిపై రెండు పార్టీల్లోనూ గుబులు రేకెత్తిస్తోంది.

దిశ, ఏపీ బ్యూరో: రాజ్యాంగం ద్వారా స్థానిక సంస్థలకు సంక్రమించిన విధులు, అధికారాలను టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు కాలరాశాయి. గ్రామ పంచాయతీలు, మండల, పురపాలక సంఘాల పాలక వర్గాలను నిర్వీర్యం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకపోగా కేంద్రం నుంచి నేరుగా వచ్చే వాటినీ దారి మళ్లిస్తున్నారు. గత ప్రభుత్వం జన్మభూమి కమిటీలు, నోడల్​ఆఫీసర్ల ద్వారా పాలన సాగించింది. ప్రస్తుత ప్రభుత్వం వాలంటీర్లు, సచివాలయాల ద్వారా పాలన నడిపిస్తోంది.

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన స్థానిక ప్రభుత్వాలకు పాలనలో ఎక్కడ జోక్యం లేకుండా చేశాయి. ఆయా పాలకవర్గాలను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశాయి. ఈపాటికే ఉన్న ప్రభుత్వ యంత్రాంగం పనితీరులో జవాబుదారీతనం, పారదర్శకత తీసుకురావడంలో విఫలమయ్యాయి. ప్రతి నెలా ఆదాయంలో 70 శాతం ఉద్యోగుల జీతభత్యాలకు వెచ్చిస్తూ వాళ్ల ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో వైఫల్యం చెందుతున్నట్లు పేర్కొంటున్నారు.

అమరావతి పైనే దృష్టి..

గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు దృష్టంతా అమరావతి రాజధాని పైనే ఉంది. రాష్ట్ర విభజన జరిగాక చెప్పుకోదగ్గ స్థాయిలో ఉపాధి అవకాశాలు మెరుగుపడలేదు. పెట్టుబడులను ఆకర్షించడానికంటూ పెద్ద ఎత్తున విదేశీ పర్యటనలు చేశారు. విశాఖలో పెట్టుబడిదారుల సదస్సులు నిర్వహించారు. ఎన్నో ఒప్పందాలు చేసుకున్నారు. అన్ని ఉద్యోగాలు వస్తున్నాయి.. ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయంటూ ఊదరగొట్టారు. చివరకు ఉద్యోగాలు కల్పించింది ఆరు లక్షల మందికే.

నాడు ప్రతీ జిల్లా అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలు ఒక్కటీ అమలు చేయలేకపోయారు. ప్రస్తుత ప్రభుత్వం సుస్థిర అభివృద్ధి జోలికే వెళ్లలేదు. కేవలం సంక్షేమ జపంతోనే నాలుగేళ్లు నెట్టుకొచ్చింది. నగదు బదిలీ పథకాల ద్వారా సుమారు రూ.2 లక్షల కోట్లను దాదాపు రెండు కోట్ల కుటుంబాలకు పంచారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రజల నెత్తిన భారాలు మోపారు. అలవికాని అప్పులు చేశారు. ప్రజలకు నికర ఆదాయ మార్గాలను చూపలేకపోయారు. సుస్థిర అభివృద్ధికి బాటలు వేయడంలో విఫలమైనట్లు తటస్థులు భావిస్తున్నారు.

ప్రజల సొమ్ముతో సంక్షేమ పథకాలకు..

ప్రజల సొమ్ముతో ఇచ్చే సంక్షేమ పథకాలకు తమ సొంత నిధులు ఇస్తున్నట్లు చంద్రబాబు, ఎన్టీఆర్​పేర్లు పెట్టుకున్నారు. ప్రజాధనంతో ఓటు బ్యాంకులు సృష్టించుకోవడానికి ప్రాధాన్యమిచ్చారు. ప్రజల్లో కులతత్వాన్ని మరింతగా పోషించారు. ప్రాజెక్టులు నత్తనడకను తలపించాయి. ప్రజల సొమ్మును ఇష్టారీతిన దుర్వినియోగం చేశారు. అభివృద్ధి పనుల మాటున అవినీతి, అక్రమాలకు తావిచ్చారు. చివరకు ఎన్నికల ఏడాదిలో పేదల గృహ నిర్మాణాన్ని చేపట్టారు. కేంద్రం మంజూరు చేసిన ఇళ్లల్లో కనీసం మూడో వంతు కూడా పూర్తి చేయలేకపోయారు.

నేడు సీఎం జగన్​కూడా ఈ పోకడలను మరింతగా ముందుకు తీసుకెళ్తున్నారు. అన్ని పథకాలకు జగనన్న పేరు తగిలించారు. కులాల వారీ కార్పొరేషన్లు పెట్టారు. వాటి ద్వారా ఆయా కులాల్లోని పేదలను ఆదుకోవడానికి బదులు కులతత్వాన్ని మరింతగా పోషిస్తున్నారు. పేదల గృహ నిర్మాణం ఆర్భాటంగా ప్రారంభించినా నాలుగేళ్లలో పదో వంతు ఇళ్లను కూడా పూర్తి చేయలేకపోయారు. ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేకపోయారు. ప్రజల సొమ్ముతో ఓటు బ్యాంకులను తయారు చేసుకోవడంలో మాత్రం చంద్రబాబు కన్నా జగన్​వంద అడుగులు ముందున్నట్లు తటస్థులు చెబుతున్నారు.

కార్పొరేట్ శక్తులకు రెడ్ కార్పెట్

చంద్రబాబు హయాంలో ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను కునారిల్లేట్లు చేశారు. ఎడ్యుకేషన్, హెల్త్​ మాఫియాలకు పెద్ద పీట వేశారు. ఈ రెండు రంగాల్లో కార్పొరేట్ ​శక్తులకు రెడ్​కార్పెట్​పరిచారు. సగటు కుటుంబాల ఆదాయంలో సింహభాగం ఈ రెండింటికే వెచ్చించాల్సి వచ్చేది. ఉద్యోగాల కల్పనంటే సాఫ్ట్​వేర్​ఒక్కటేననే భ్రమల్లోకి నెట్టేశారు. రాష్ట్రానికి ఆయువుపట్టు అయిన వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారు. 70 శాతంగా ఉన్న కౌలు రైతులను పట్టించుకోలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కౌలు రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది.

ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో వసతులు మెరుగుపరిచారు. అందుకోసం వేల కోట్లు వెచ్చించారు. అయినా అస్తవ్యస్త నిర్ణయాల వల్ల అవి పేదల బడులు, ఆస్పత్రులుగానే మిగిలిపోయాయి. వాటిని అన్ని వర్గాల ప్రజలు వినియోగించుకునే చొరవను పెంచలేకపోయారు. ఒక్క విద్య, వైద్య రంగాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేయడంలో తప్ప మిగతా అన్నింటిలోనూ చంద్రబాబు, జగన్​వైఖరి ఒకే రకంగా ఉన్నట్లు తటస్థుల్లో నెలకొంది.

కేంద్రంతో లాలూచీ..

కేంద్ర ప్రభుత్వంతో సంబంధాల విషయంలోనూ ఇద్దరు నేతలు లాలూచీ పడుతున్నట్లు తటస్థులు భావిస్తున్నారు. ప్రత్యేక హోదా పోరాటాన్ని వెనక్కి నెట్టి చంద్రబాబు ప్యాకేజీకి అంగీకరించారు. విశాఖ రైల్వే జోన్​గురించి పట్టుబట్టలేకపోయారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పక్కన పెట్టి పట్టిసీమ ఎత్తిపోతలను ముందుకు తెచ్చారు. ప్రాజెక్టు నిర్మాణం గురించి తప్ప పునరావాసం, పరిహారం చెల్లింపుల్లో తీవ్ర నిర్లక్ష్యం చేశారు. విభజన చట్టంలో పొందుపరిచిన దుగ్గరాజపట్నం పోర్టు వీలుకాదని తెలిసినప్పుడు కనీసం రామాయపట్నం పోర్టును నిర్మించాలని కోరాలి. కృష్ణపట్నం పోర్టు కోసం రామాయపట్నం పోర్టును బలి చేశారు.

కడప ఉక్కు ఫ్యాక్టరీని సాధించలేకపోయారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా విభజన హామీల్లో ఏ ఒక్కటీ రాబట్టలేక పోయారు. ప్రస్తుత సీఎం జగన్​అయితే అసలు కేంద్రానికి పూర్తి స్థాయిలో మోకరిల్లుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సైతం కేంద్ర విధానాలు అమలు చేయడానికి వెనకాడుతుంటే ఇక్కడ మాత్రం తుచ తప్పకుండా అమలు చేస్తున్నారు. పోలవరానికి కొర్రీలేస్తున్నా నిలదీయలేరు. విశాఖ ఉక్కును తెగనమ్ముతామంటుంటే ఎదిరించింది లేదు. కేవలం అప్పుల కోసం తల వంచడం తప్ప విభజన హామీలను ఏ ఒక్కటీ సాధించలేకపోయారు. ఇప్పటిదాకా దొందూ దొందే అన్నట్లు తటస్థులు భావిస్తున్నారు. ఎన్నికల నాటికి ఎవరి వైపు మొగ్గుచూపుతారనేది ఇరు పార్టీల్లోనూ గుబులు రేకెత్తిస్తోంది.

Tags:    

Similar News