AP:‘పార్టీకి ద్రోహం చేసే పని చేయను’.. ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌తో కలిసి విగ్రహావిష్కరణలో పాల్గొన్న వివాదంపై టీడీపీ నేత, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు వివరణ ఇచ్చారు.

Update: 2024-12-18 09:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌తో కలిసి విగ్రహావిష్కరణలో పాల్గొన్న వివాదంపై టీడీపీ నేత, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు వివరణ ఇచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీకి ద్రోహం చేసే పని తానెప్పుడు చేయనని, పార్టీకి తానెప్పుడు విధేయుడిగానే పని చేస్తానని చెప్పారు. మాజీ మంత్రి జోగి రమేష్‌తో తనకు ఎటువంటి సంబంధాలు లేవని, విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఘటన యాధృచ్చికంగా జరిగిందని చెప్పారు.గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఆహ్వాన కమిటీ వాళ్ల ఆహ్వానం మేరకే తాను ఆ కార్యక్రమానికి వెళ్లానని, జోగి రమేష్ వస్తున్నారన్న సమాచారం తనకు ఏ మాత్రం తెలియదని.. తాను అక్కడకు వెళ్లిన తర్వాత జోగి రమేష్ వచ్చారని కొనకళ్ల నారాయణరావు వివరించారు.

గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వివాదం చేయకూడదన్న ఉద్దేశంతోనే జోగి రమేష్ వచ్చినా ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చిందన్నారు. దీనిపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ఖండిస్తున్నామన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి అన్ని విషయాలు వివరిస్తానని కొనకళ్ల నారాయణరావు స్పష్టం చేశారు. రేషన్ బియ్యం కేసులో పేర్ని నానిని కాపాడాల్సిన అవసరం కూటమి నేతలకు లేదన్నారు. పేర్ని నాని అనే వ్యక్తి మాకు అజాత శత్రువు అని, ఆయన చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదని అన్నారు. పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని దోచుకు తిన్న వ్యక్తి పేర్ని నాని అని, పక్కదారి పట్టించిన బియ్యానికి డబ్బులు కట్టినంత మాత్రాన కేసు నుండి బయటపడలేరని కొనకళ్ల నారాయణరావు అన్నారు.


Similar News