పెరుగుతున్న గోదావరి ఉధృతి: గండిపోశమ్మ ఆలయంలోకి నీరు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ఉధృతి పెరుగుతుంది.
దిశ, డైనమిక్ బ్యూరో : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ఉధృతి పెరుగుతుంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద నీరు వచ్చి చేరుతుంది. దేవీపట్నం కాఫర్ డ్యాం బ్యాక్ వాటర్ కారణంగా వరద నీరు పెరుగుతుంది. ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా గండిపోశమ్మ ఆలయంలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆలయ అధికారులు అలర్ట్ అయ్యారు. ఆలయ సమీపంలోని దుకాణాలను పూర్తిగా మూయించి వేశారు. వరద ఉధృతి క్రమేపి పెరుగుతున్న దృష్ట్యా గండిపోశమ్మ ఆలయంలో దర్శనాలను తాత్కాలికంగా నిలిపేవేశామని భక్తులు గమనించాలని కోరారు. అలాగే ముందస్తు చర్యల్లో భాగంగా పాపికొండలు విహార యాత్రకు వెళ్లే బోట్లను సైతం నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు వరద క్రమేపి పెరగడంతో దేవీపట్నం మండలం తాళ్లూరులో 50 కుటుంబాలు కొండలు, గుట్టలపైకి చేరి తలదాచుకుంటున్నాయి. మరోవైపు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరుగుతుంది. దీంతో బ్యారేజీ నుంచి 1.20 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి అధికారులు విడిచిపెడుతున్నారు.