ఆరోగ్య శాఖలో బోగస్ సర్టిఫికేట్లతో రెగ్యులర్ ఉద్యోగాలు

గత వైసీపీ పాలనలో ఆరోగ్యశాఖ భ్రష్టు పట్టి పోయింది.

Update: 2024-07-30 03:01 GMT

దిశ ప్రతినిధి, కర్నూలు: గత వైసీపీ పాలనలో ఆరోగ్యశాఖ భ్రష్టు పట్టి పోయింది. ఆ శాఖలో అంతులేని అవినీతి అక్రమాలతో పాటు నకిలీ సర్టిఫికెట్లు కలిగిన కేటుగాళ్లు ప్రభుత్వ కొలువులు పొందడం గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. యూనియన్ నాయకుల ముసుగులో పారిశుధ్య కార్మికులు పావులు కదపగా మెడికల్ ఆఫీసర్లు, జిల్లా వైద్యాధికారులు తమవంతుగా ఈ నకిలీ సర్టిఫికెట్ల కేటుగాళ్లకు సహకరిస్తే సీఎస్, ఆరోగ్య శాఖ అధికారులు పచ్చ నోట్లు తీసుకుని వారికి పచ్చజెండా ఊపారు. అర్హులకు అన్యాయం చేసి అనర్హులను అందలమెక్కించారు. కడుపు మండిన బాధితులు తమకు న్యాయం చేయాలని లోకాయుక్తను ఆశ్రయించారు. దీంతో లోకాయుక్త నేడు విచారణకు రావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. నేడు లోకాయుక్త కోర్టుకు బాధితులు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు.

4,500 మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు..

ఏపీలో ఆరోగ్యశాఖలో 4,500 మందికి పైగా మగ ఆరోగ్య కార్యకర్తలున్నారు. వీరు 2002లో పారా మెడికల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా అవుట్ సోర్సింగ్, ఒప్పంద ప్రాతిపదికన పని చేస్తున్నారు. వీరికి నెలకు రూ.32 వేల వేతనం ఇస్తున్నారు. చాలా కాలం తర్వాత గత వైసీపీ ప్రభుత్వం వీరిలో కొందరిని రెగ్యులర్ చేసింది. అందులో దాదాపు సగానికి పైగా నకిలీ సర్టిఫికెట్లు కలిగిన వారు రెండు దశాబ్ధాలకు పైగా ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. అందులో ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుంచి సర్టిఫికెట్లు పొందిన చాలా మంది నకిలీ సర్టిఫికెట్లు కలిగిన వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని, అదే సమయంలో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించే సంస్థలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తూ వచ్చారు.

స్పందించిన ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2010 అక్టోబర్ 10న జీవో నెం.1402 ప్రకారం నకిలీ సర్టిఫికెట్లు సృష్టిస్తున్న సంస్థలపై విచారణ చేయాలని సీబీసీఐడీకి ఆదేశించింది. కానీ సీబీసీఐడీ ఆ విద్యాసంస్థలపై ఎలాంటి విచారణ చేపట్టలేదు. ఒకవేళ చేపట్టినా వాటికి సంబంధించిన రిపోర్టును ప్రభుత్వానికి అందజేయలేదు. నకిలీ సర్టిఫికెట్ల బాగోతం బయటకు రాకపోవడానికి ప్రధాన కారణం మున్సిపాల్టీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులే నకిలీ సర్టిఫికెట్లు పుట్టించుకుని ఆరోగ్య కార్యకర్తలుగా విధులు నిర్వహిస్తున్నారు. అందువల్ల ఈ భాగోతాలు బట్టబయలు కావడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు.

ఎలా బయటపడిందంటే..

ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన మగ ఆరోగ్య కార్యకర్తలు పని చేస్తున్నారు. అందులో చాలా మంది నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉండడంతో భవిష్యత్ లో అర్హులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని భావించారు. దీంతో 2002 నుంచి ఉమ్మడి ఏపీలో నకిలీ సర్టిఫికెట్లతో విధులు నిర్వహిస్తున్నారని, అలాంటి వారి సర్టిఫికెట్లు పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని అర్హులైన మగ ఆరోగ్య కార్యకర్తలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత స్పందించిన ప్రభుత్వం 2010 అక్టోబర్ 10న జీఓ నెం.1402 ప్రకారం నకిలీ సర్టిఫికెట్లు సృష్టిస్తున్న సంస్థలపై విచారణ చేయాలని సీబీసీఐడీకి ఆదేశించింది. కానీ సీబీసీఐడీ అధికారులు ఏ విషయాన్ని వెల్లడించలేదు. వారిపై నమ్మకం సన్నగిల్లడంతో మళ్లీ బాధితులు 2013లో సమాచార హక్కు చట్టం ద్వారా నకిలీ సర్టిఫికెట్ల వివరాలు కావాలని, అలాంటి వారిపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేయించాలని కోరారు.

రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు నిజాలను నిగ్గు తేల్చారు. 2019లో వాటికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేశారు. ఉమ్మడి ఏపీ వ్యాప్తంగా 2 వేల మందికి పైగా ఎలాంటి ప్రభుత్వ గుర్తింపు లేని ఇతర రాష్ట్రాలకు చెందిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ముంబాయి, కర్ణాటక, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ హైజీన్ న్యూ ఢిల్లీ, ఏపీలోని బెతేస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, శానిటేషన్ టెక్నాలజీ విశాఖపట్నం, ది కాలేజ్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ ఒంగోలుకు చెందిన సంస్థలు సొంతంగా అచ్చువేసి నకిలీ సర్టిఫికెట్లను సృష్టించి లక్షల్లో అమ్మకాలు చేశారని నిర్ధారించారు. అభ్యర్థులు పది, ఇంటర్ చదివిన వారికి ఈ సంస్థలు సర్టిఫికెట్లు అందించాయి.

జీవో లలో క్లాజులను అడ్డంపెట్టుకుని..

ఉమ్మడి ఏపీలో శ్రీకాకుళం, ఏలూరు, కడప, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు వంటి పది ప్రాంతాల్లో మాత్రమే ప్రభుత్వ పరమైన శిక్షణ సంస్థలున్నాయి. కానీ బోగస్ సంస్థలు ప్రభుత్వం శానిటరీ ఇన్‌స్పెక్టర్ కోర్సును ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో శిక్షణ పొందేవారి కోసం ఉద్దేశించి ఏర్పాటు చేసిన, సర్వీస్ రూల్స్ జీవోలో ఉన్న క్లాజులను అడ్డం పెట్టుకొని మొత్తం డ్రామా నడిపారన్న ఆరోపణలున్నాయి. భౌతికంగా శిక్షణ సంస్థలు లేవని, శిక్షణ ఇవ్వడం లేదని, సంస్థలకు గానీ, శిక్షణ కోర్సులకు గానీ ప్రభుత్వ అనుమతుల్లేవు.

ఒకే విద్య సంవత్సరంలో ఇంటర్, డిప్లొమాను, ఒకే సంవత్సరంలోనే పది, డిప్లొమాను, ఇంటర్ పూర్తయిన వెంటనే కేవలం నెలల వ్యవధిలోనే డిప్లొమా పూర్తి చేసినట్లు, పది పూర్తైన నెలల వ్యవధిలోనే డిప్లొమా సర్టిఫికెట్ పొందినట్లు అంటే కేవలం 9 నెలల కాల వ్యవధిలో ఇంటర్, డిప్లొమా పూర్తైనట్లు సర్టిఫికెట్లు సృష్టించారు. ఏడాదిలో ఎన్ని నెలలుంటే అన్ని నెలల తేదీలతో కోర్సు సర్టిఫికెట్లు రిలీజ్ చేసినట్లు గుర్తించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం 1997 నుంచి 2013 వరకు ఎలాంటి ప్రయివేట్ శిక్షణా సంస్థలకు పారా మెడికల్ కోర్సులకు అనుమతి ఇవ్వలేదని ఏపీ పారామెడికల్ బోర్డు స్పష్టం చేసింది. ఏపీ సర్వీస్ రూల్స్ జీవో 273 వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 1989 నియమ నిబంధనల ప్రకారం శానిటరీ ఇన్స్‌స్పెక్టర్ ట్రైనింగ్ కోర్సును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది.

నకిలీ దారులకు ‘వైసీపీ అధికారుల’ అండ

2024 సార్వత్రిక ఎన్నికల ముందు గత వైసీపీ ప్రభుత్వంలో సీఎస్‌గా పని చేసిన జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్లతో పాటు మెడికల్ ఆఫీసర్లు, జిల్లా వైద్యాధికారులు నకిలీ సర్టిఫికెట్లు కలిగిన దాదాపు 2 వేల మందికి జీఓఎంఎస్ 114 ప్రకారం ఒప్పంద ఆరోగ్య కార్యకర్తలను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంపై సుప్రీంకోర్టు కూడా ఫైనల్ జడ్జిమెంట్ లో రెగ్యూలర్ నియామకాలకు వెళ్లేటప్పుడు సర్వీసు రూల్స్ ను కచ్చితంగా పాటించాలని తీర్పునిచ్చింది. అధికారులు వాటిని పరిశీలించకుండా ముడుపులు ముట్టజెప్పిన చాలా మంది నకిలీ సర్టిఫికెట్లు కలిగిన వారినే రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలో కడుపు మండిన కడప జిల్లాకు చెందిన బాలుడుతో పాటు మరికొంత మంది బాధితులు 2024 జనవరి 17న ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. కేసు నెంబర్ 282/2024/బీ-1 గా జనవరిలో నమోదు చేసుకుని విచారణ చేపట్టింది.

అందులో భాగంగానే లోకాయుక్త జనవరి 24న ప్రతివాదులైన మాజీ సీఎస్, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్లకు అలాగే సమాచార నిమిత్తం ఫిర్యాదు దారులకు నోటీసులు పంపింది. కానీ వారు ఎవరూ హాజరు కాలేదు. దీంతో ఏప్రిల్ 30 న హాజరు కావాలని మరోమారు రిమైండర్ నోటీసులు పంపింది. దీంతో మాజీ సీఎస్, ఆరోగ్య శాఖకు చెందిన మరి కొంతమంది రాష్ట్ర ఉన్నతాధికారులు నేడు కర్నూలులోని లోకాయుక్తకు హాజరు కానున్నారు. విచారణ నేపథ్యంలో నేడు వందల సంఖ్యలో బాధితులు కర్నూలులోని లోకాయుక్తకు రానున్నారు. గత వైసీపీ చేసిన తప్పిదాల కారణంగా తాము అన్యాయానికి గురయ్యామని, ప్రస్తుతం సీఎం చంద్రబాబు దీనిపై చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. విచారణ నేపథ్యంలో న్యాయం చేయకపోతే ధర్మ పోరాటానికి సిద్ధం కానున్నారని, అక్కడే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి విడతల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఏపీ డీఎస్సీ కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ యర్రపు రెడ్డి విశ్వనాథ రెడ్డి తెలిపారు.


Similar News