Ap News: ప్రధాని మోడీ కేబినెట్‌లో చోటు దక్కేదెవరికి?

ప్రధాని నరేంద్రమోడీ తన ఎన్నికల టీంను రెడీ చేసుకుంటున్నారు....

Update: 2023-06-30 10:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్రమోడీ తన ఎన్నికల టీంను రెడీ చేసుకుంటున్నారు. త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను ధీటుగా ఎదుర్కొనేందుకు మోడీ వ్యూహం రచిస్తున్నారు. ఇందులో భాగంగా కేబినెట్‌ విస్తరణ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల టీంను కేబినెట్‌లో చేర్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ప్రధాని నరేంద్రమోడీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతుంది. జులై 3న కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి చోటు కల్పిస్తారనే దానిపై చాలా కథనాలు వినిపిస్తున్నాయి.

ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలోని ఒక ఎంపీకి కేబినెట్‌లో చోటు కల్పిస్తారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల అనంతరం ఏపీ నుంచి మోడీ కేబినెట్‌లో అసలు ప్రాతినిథ్యమే లేదు. అయితే ఈసారి ఖచ్చితంగా ఏపీకి ఛాన్స్ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఎవరు మోడీ కేబినెట్‌లో చోటు దక్కించుకుంటారనే ఆసక్తికర చర్చ తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్‌లో మొదలైంది.

హ్యాట్రిక్‌పై గురి

కేంద్రంలో హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. అందుకు అనుగుణంగా కార్యచరణ సిద్ధం చేసుకుంటుంది. మూడోసారి కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే పరమావధిగా బీజేపీ అగ్రనాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే మరికొన్ని నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు సైతం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్నికల టీమ్‌ను బీజేపీ అగ్రనాయకత్వం రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అందుకు ముహూర్తం సైతం ఫిక్స్ చేశారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

జులై 3న విస్తరణ జరగనుందని తెలుస్తోంది. సోమవారం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సహాయ మంత్రులు, ఇండిపెండెంట్ చార్జ్ ఉన్న సహాయమంత్రులు కూడా హాజరుకావాలని కేంద్రం ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశశంలోనే కొందరి మంత్రుల నుంచి అక్కడే రాజీనామా లేఖలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈసారి కేబినెట్‌లో కొత్తగా ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది.

ఈసారి ఏపీకి పక్కానా?

2014లో కేంద్ర కేబినెట్‌లో ఏపీ నుంచి ప్రాతినిధ్యం ఉంది. నాడు టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీ ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో నాడు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలకు కేంద్ర కేబినెట్‌లో చోటు కల్పించారు. అయితే పొత్తు మధ్యలోనే చెడిపోవడంతో ఇద్దరు తమ కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, వైసీపీలు ఒంటరిగా పోటీ చేశాయి. అయితే బీజేపీ నుంచి ఒక్కరూ కూడా అటు లోక్‌సభ, ఇటు అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. వైసీపీ, టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. జనసేన నుంచి ఒక ఎమ్మెల్యే గెలుపొందినప్పటికీ వైసీపీకి అనుబంధంగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఎంపీలు అంతా వైసీపీ, టీడీపీకి చెందిన వారే కావడంతో రెండో టెర్మ్‌లో కేంద్రంలో ఎవరికీ చోటు కల్పించలేదు. అయితే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటారనే ప్రచారం గతంలో జరిగింది. కానీ అవేమీ జరగలేదు. దీంతో మోడీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కేబినెట్‌లో ఏపీ నుంచి ఒక్కరికి కూడా అవకాశం కల్పించలేదు. అయితే ఈ విస్తరణలో చోటు దక్కుతుందనే ప్రచారం జరుగుతుంది.

జీవీఎల్ లేక సీఎం రమేశ్

టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేశ్‌కు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు జీవీఎల్ నరసింహారావు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జీవీఎల్ నరసింహారావు యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఆయనకు కేంద్రంలో చోటు దక్కే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఏపీ నుంచి ఒకరికి కేంద్ర కేబినెట్‌లో చోటు కల్పించాలంటే ఖచ్చితంగా ఎంపీ జీవీఎల్, సీఎం రమేశ్‌లలో ఎవరో ఒకరికి బెర్త్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. పార్టీ పరంగా చూస్తే జీవీఎల్‌కు ప్రాధాన్యం ఇచ్చే ఛాన్స్ ఉంది. బీజేపీలో మొదటి నుంచి జీవీఎల్ ఉన్నారు. అంతేకాకుండా బీజేపీలోని అగ్రనాయకత్వానికి దగ్గరగా ఉంటున్నారు. అందరితోనూ సత్సంబంధాలు ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు ఇన్‌చార్జిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలను పరిశీలిస్తే జీవీఎల్‌కే అత్యధిక శాతం అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సీఎం రమేశ్ టీడీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. అనంతరం బీజేపీలో చేరిపోయారు. ప్రస్తుతం బీజేపీ ఎంపీగానే కొనసాగుతున్నారు.

Tags:    

Similar News