ఏపీలో ఎన్నికలకు రంగం సిద్ధం: నోటిఫికేషన్ విడుదలయ్యేది అప్పుడే!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలపై అనేక కథనాలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Update: 2023-12-15 05:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలపై అనేక కథనాలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ మార్చిలోనే ఎన్నికలు అని ఒక ప్రచారం జరుగుతుంది. అలాంటిదేమీ లేదని లోక్‌సభ ఎన్నికలతోపాటే ఏపీలో ఎన్నికలు కూడా జరుగుతాయని మరో ప్రచారం జరుగుతుంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తే మార్చి 6న ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఒక ప్రచారం జరిగితే ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మార్చిలోనే టెన్త్ ఇంటర్ పరీక్షలు పూర్తి చేయాలనే యోచనలో వైసీపీ ప్రభుత్వం ఉంది. ఇదంతా ఒక ఎత్తైతే ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. మెుత్తానికి ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో అన్నదానిపై టెన్షన్ నెలకొంది. ఇలాంటి తరుణంలో ఏపీలో ఏప్రిల్ నెలలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని చెప్తోంది.

ముందస్తు ఎన్నికల్లేవ్

ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ నెలలోనే ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం హోరెత్తిస్తోంది. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికలతోపాటే ఏపీలో ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదలయ్యే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ప్రచారం జరుగుతుంది.ఏపీలో ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ మార్చిలో వస్తాయని, ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగుతాయని తెలుస్తుంది. లోక్‌సభ ఎన్నికలను ఈసారి ఎనిమిది దశలలో నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి సౌత్ నుంచి తొలిదశ ఎన్నికలు మెుదలు పెడతారా? లేక నార్త్ నుంచి మెుదలు పెడతారా? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ సౌత్ నుంచి లోక్‌సభ ఎన్నికలు మెుదలు పెడితే మధ్యే మార్గంగా ఏపీలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

మెుదటి రెండుదశల్లోనే ఎన్నికలు

గత లోక్‌సభ, ఏపీ ఎన్నికలను పరిశీలిస్తే మొదటి రెండు దశలలోనే ఏపీలో ఎన్నికలు జరిగాయి కాబట్టి ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగుతుందని తెలుస్తోంది. అదే కనుక జరిగితే ఏపీలో ఏప్రిల్‌లో మొదటి రెండు దశలలో ఎన్నికలు జరగడం ఖాయంగా తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈ విధంగా స్పష్టమైన సంకేతాలు ఉండబట్టే ఏపీ ప్రభుత్వం కూడా అందుకు సన్నద్ధమవుతుందని తెలుస్తోంది.

ప్రభుత్వానికి ముందస్తు సమాచారం

ఇదిలా ఉంటే ఏపీలో ఎన్నికలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పరీక్షలను కాస్త ముందుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందే టెన్త్, ఇంటర్ పరీక్షలు పూర్తి చేసేలా కార్యచరణ సిద్ధం చేసినట్లు వెల్లడించారు. మార్చి 31 వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. అంటే మార్చిలో ఎన్నికలు అనేది అవాస్తవం అని తెలుస్తోంది.ఏప్రిల్‌లోనే ఎన్నికలు జరుగుతాయనే సమాచారం ఉంది కాబట్టే ప్రభుత్వం మార్చిలోనే టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహించనుంది అని తెలుస్తోంది. పోలింగ్ స్టేషన్లుగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలే వాడుకుంటారు కాబట్టి ఈ ముందస్తు ఏర్పాట్లు అని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News