ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం.. చంద్రబాబుతో ‘పీకే’ భేటీ.. వైసీపీకి బిగ్ షాక్..!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందడి మొదలైంది. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నికల పనుల్లో నిమగ్నమైపోయాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందడి మొదలైంది. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నికల పనుల్లో నిమగ్నమైపోయాయి. 175 అసెంబ్లీ సీట్లు గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో అప్రమత్తమైన జగన్.. ప్రజల్లో వ్యతిరేత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పునకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో బీఆర్ఎస్ దాదాపు సిట్టింగ్‌లకే టికెట్లు ఇవ్వడంతో.. గులాబీ పార్టీ 39 సీట్లకే పరిమితమై అధికారానికి దూరమైన సంగతి తెలిసిందే.
ఈ పరిణామంతో అలర్ట్ అయిన జగన్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టి.. వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థాన చలనం లేదా నిర్మోహమాటంగా టికెట్ నిరాకరిస్తున్నారు. మరోవైపు వైసీపీ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతున్నాయి. ఎట్టిపరిస్థితుల్లో జగన్‌ను రెండవ సారి అధికారంలోకి రానివ్వద్దనే లక్ష్యంతో బాబు, పవన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటి నుండే అభ్యర్థుల ఎంపిక, ఉమ్మడి మేనిఫెస్టోపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో కలిసి పీకే ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చారు. అనంతరం ఎయిర్ పోర్టు నుండి ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో పీకే భేటీ అయ్యారు. ప్రశాంత్ కిషోర్, చంద్రబాబుల సమావేశంలో గత కొంతకాలంగా టీడీపీ ఎన్నిల వ్యూహకర్తగా పనిచేస్తున్న రాబిన్ శర్మ కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులతో పాటు రాబిన్ శర్మ టీం ఇప్పటికే వరకు చేసిన సర్వేలపై పీకే, బాబు చర్చించినట్లు టాక్. అంతేకాకుండా జనసేనతో పొత్తు, సీట్ల కేటాయింపు, మేనిఫెస్టో, ప్రచారం, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వీరిద్దరూ మాట్లాడుకున్నట్లు సమాచారం.
అయితే, మరో మూడు నెలల్లో ఎన్నికల జరగనున్న వేళ పీకే, బాబు భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇదే కాకుండా, గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి వ్యూహాకర్తగా పని చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయాన్ని సాధించింది. 151 సీట్లు గెలిచి వైసీపీ అధికారంలో వచ్చింది. గతంలో జగన్‌కు వ్యూహాకర్తగా పని చేసిన పీకే ఈ సారి చంద్రబాబుతో చేయి కలపడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జగన్ బలాలు, వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలు అన్ని తెలిసిన పీకే చంద్రబాబుతో కలవడం అధికార వైసీపీ పార్టీకి భారీ దెబ్బ అనే చెప్పవచ్చు. మరి చంద్రబాబు, పీకే భేటీ వెనుక అసలు కారణం ఏంటి అన్నది తెలియాల్సి ఉంది.