Breaking: విశాఖ ఎమ్మార్వో హత్య కేసులో మరిన్ని కీలక ఆధారాలు
విశాఖ రూరల్ ఎమ్మార్మో రమణయ్య హత్య కేసులో కీలక ఆధారాలు పోలీసులు సేకరించారు..
దిశ, వెబ్ డెస్క్: విశాఖ రూరల్ ఎమ్మార్మో రమణయ్య హత్యకు గురైన విషయం తెలిసింది. అయితే ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఎమ్మెర్వో రమణయ్యను రియల్టర్ మణికంఠ గంగారాం హత్య చేశారని గుర్తించారు. ఈ హత్యకు రియల్ ఎస్టేట్ వ్యవహారాలే కారణమని నిర్ధారించారు. ఎమ్మార్వో రమణయ్యతో నిందితుడు రియల్టర్ మణికంఠ గంగారాంకు భూ లావాదేవీలకు సంబంధించి ఒప్పందాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విశాక రుషికొండ అపార్ట్ మెంట్స్‌లోని 22ఏ విషయంలో ఎమ్మార్వోతో గంగారం ఒప్పందం చేసుకున్నారు. వీటితో పాటు మరికొన్ని భూలావాదేవీలు ఇద్దరి మధ్య నడుస్తున్నాయి. అయితే కొన్ని భూ వ్యవహారాల్లో డబ్బులు చెల్లించకుండా పనులు చేయించుకోవాలని రియల్టర్ గంగారం ప్లాన్ చేశారు. అవరమైతే ఎమ్మార్వోను బెదిరించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఎమ్మార్వో రమణయ్య ఎప్పుడు కార్యాలయానికి వచ్చి వెళ్తారో డ్రైవర్ ద్వారా తెలుసుకున్నారు. పక్కా ప్రణాళికతోనే ఎమ్మార్వో రమణయ్యను రాడ్‌తో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక రమణయ్యపై దాడి చేసిన మణికంఠ గంగారాం పారిపోయారని... ఆయనకు సంబంధించి రెండు విమాన టికెట్లు బుకింగ్ చేసినట్లు సాంకేతిక ఆధారాలను గుర్తించారు. వీటి ద్వారా నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గంగారం నాలుగు సిమ్‌లు వాడుతున్నట్లు పోలీసులు ధృవీకరించారు. పోలీసులు బృందాలుగా విడిపోయి గంగారాం కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
కాగా విశాఖ రూరల్ చినగదిలి తహశీల్దార్ రమణ్య ఇటీవల విజయనగరం జిల్లా బొండపల్లికి బదిలీ అయ్యారు. అయితే విశాఖ కొమ్మాదిలోని ఓ ఆపార్ట్ మెంట్‌లో ఉంటున్నారు. శుక్రవారమే బొండపల్లిలో ఎమ్మార్వోగా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం విశాఖ కొమ్మాదికి తిరిగి వచ్చి తన నివాసంలో ఉన్నారు. శుక్రవారం రాత్రి ఫోన్ రావడంతో ఆయన అపార్ట్ మెంట్ ఐదో అంతస్తు నుంచి కిందకి వచ్చారు. ఈ క్రమంలో ఆయనపై దుండగులు ఇనుపరాడ్‌తో దాడి చేశారు. దీంతో ఎమ్మార్వో రమణయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో చికిత్స పొందుతూ రమణయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తాజాగా కీలక అధారాలు లభ్యమయ్యాయి.