అంగన్‌వాడీలపై ఉక్కుపాదం.. విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత
తమ సమస్యలు పరిష్కరించాలంటూ పోరాటం చేస్తున్న అంగన్ వాడీలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు...
దిశ, వెబ్ డెస్క్: తమ సమస్యలు పరిష్కరించాలంటూ పోరాటం చేస్తున్న అంగన్ వాడీలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.. విజయవాడ ధర్నా చౌక్‌లో దీక్ష చేస్తున్న అంగన్ వాడీలను సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. దీక్షా శిబిరం నుంచి బలవనంతంగా బస్సులోకి ఎక్కించి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. 1000 మంది పోలీసులు 20 బస్సులో మచిలీపట్నం పోర్టు వైపు కొందరిని.. మరికొంతమందిని వివిధ ప్రాంతాలకు తరలించారు. అయితే వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు యత్నిస్తున్నారు. దీంతో అంగన్‌వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు అణచివేత ధోరిణి ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల అక్రమ అరెస్ట్‌లపై నిరసన వ్యక్తం చేశారు.
కాగా అంగన్ వాడీలపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా వెనక్కితగ్గడంలేదు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. ఆరు రోజులుగా విజయవాడ ధర్న చౌక్‌లో నిరహార దీక్షకు దిగారు. దీంతో అంగన్ వాడీల నిరహార దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. జగనన్నకు చెబుదాం పేరుతో నేడు చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపు నిచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కోటి సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి జగన్‌కు ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అంగన్‌వాడీలందరూ విజయవాడకు భారీగా తరలివస్తున్నారు. అయితే చలో విజయవాడకు అనుమతి లేదని, ఎవరూ రావొద్దని పోలీసులు అడ్డుకుంటున్నారు. అంగన్‌వాడీలు మాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఏదోలా విజయవాడకు తరలివచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎక్కడికక్కడ వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి.