Andhra Pradesh : పాలన తీరుపైనే ప్రజల్లో వ్యతిరేకత?

ముఖ్యమంత్రిగా జగన్​ అధికారం చేపట్టిన రోజు నుంచి అన్నింటికీ నవరత్నాలే పరిష్కారమనే దిశగా అడుగులు వేస్తున్నారు.

Update: 2023-06-24 04:15 GMT

దిశ, ఏపీ బ్యూరో : ముఖ్యమంత్రిగా జగన్​ అధికారం చేపట్టిన రోజు నుంచి అన్నింటికీ నవరత్నాలే పరిష్కారమనే దిశగా అడుగులు వేస్తున్నారు. మధ్యలో వచ్చిన కొవిడ్​తో ప్రజల జీవనం స్తంభించింది. కొలువులు ఊడాయి. ఆదాయాలు పడిపోయాయి. కరోనా బారిన పడ్డ వాళ్లు కొంపాగోడు తెగ నమ్ముకోవాల్సి వచ్చింది. మొత్తంగా చోటుచేసుకున్న ఆర్థిక విస్ఫోటనానికి సగటు ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాయి. కొవిడ్​ అనంతర కాలం లోనైనా ఉపాధి అవకాశాలను పెంచే దిశగా సీఎం జగన్​ సరైన కార్యాచరణ చేపట్టలేకపోయారు. కేంద్రంతో సత్సంబంధాలున్నా కనీసం కొన్ని భారీ పరిశ్రమలను సాధించలేకపోయారు. కీలకమైన వ్యవసాయ రంగంలో బహుముఖంగా ఉపాధి పెంచడానికి చర్యలు తీసుకోలేకపోయారు. కేవలం నగదు బదిలీ పథకాలతో తాత్కాలిక ఉపశమనం కల్పించడానికే పరిమితమయ్యారు. ప్రజల్లో అసంతృప్తికి ఇదే బీజం వేసింది.

బాదుడే బాదుడు..

రాష్ట్రంలో సుమారు 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులున్నారు. అందులో మూడొంతుల మంది అర్బన్​ ప్రాంతాల్లోని మురికివాడల్లో జీవిస్తున్నారు. కీలక సమయంలో కార్మికులను ఆదుకునే భవిష్య నిధిని ప్రభుత్వం దారి మళ్లించింది. ఇసుక, సిమెంటు, ఐరన్​ ధరలు పెరగడంతో నిర్మాణాలు మందగించాయి. ప్రభుత్వ విధానాల మూలంగా రియల్​ ఎస్టేట్​ రంగం కుదేలైంది. దీంతో కార్మికులకు పని దొరకడం గగనమైంది. వాళ్లు నిత్యం కొనే సరకులపై జీఎస్టీ బాదుడుతో ధరలు మండిపోతున్నాయి. పెట్రోలు, డీజిల్​, వంట గ్యాస్​ ధరల పెంపుతో కార్మికుల బతుకులు మరింతగా ఛిద్రమయ్యాయి. కరెంటు బిల్లులు, రవాణా చార్జీలు తడిసి మోపెడయ్యాయి. దీనికి తోడు మద్యం ధరలు రెట్టింపు కావడంతో ప్రతి కుటుంబం పీకల్లోతు అప్పుల్లోకి జారిపోయింది. ఓవైపు ఉపాధి కరవై.. జీవన వ్యయం పెరగడంతో ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పొంతన లేని ఆదాయ వ్యయాలు..

వివిధ ప్రభుత్వ శాఖలు, స్కీముల్లో కాంట్రాక్టు, అవుట్​ సోర్సింగ్​, ఎన్​ఎంఆర్​లుగా సుమారు 3 లక్షల మంది ఏళ్ల తరబడి చాలీచాలని వేతనాలతో వెట్టి చాకిరీ చేస్తున్నారు. ఈ నాలుగేళ్లలో వాళ్లకు పెరిగిన వేతనానికి నిరంతరం పెరుగుతున్న భారాలకు పొంతన లేదు. చివరకు సంక్షేమ పథకాలకూ నోచుకోవడం లేదు. అత్తెసరు భత్యంతో ఇంకెన్నాళ్లు కాపురాలు నెట్టుకురావాలంటూ ఆక్రోశిస్తున్నారు. అధికారానికి వస్తే వీళ్లందర్నీ రెగ్యులర్​ చేస్తామన్న హామీకి ప్రభుత్వం తూట్లు పొడిచింది. సీఎం జగన్​ తమను మోసం చేశారనే ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.

నేతన్నల బతుకు ఛిద్రం..

చేనేత కార్మికుల్లో 70 శాతానికి పైగా నెలకు రూ.5 వేల లోపు ఆదాయంతో చావలేక బతుకుతున్నారు. ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం ద్వారా ఏటా రూ.24 వేల చొప్పున సుమారు 80 వేల మందికి అందిస్తోంది. వాళ్ల వృత్తిని మెరుగుపరిచి వివిధ రూపాల్లో సబ్సిడీల ద్వారా ఆదాయం పెంచడానికి బదులు కేవలం అరకొర సాయంతో సరిపెట్టింది. దీనికితోడు కేంద్ర సర్కారు నూలు మీద 5 శాతం జీఎస్టీ విధించింది. మగ్గాల అభివృద్ధి కోసం కేంద్రం మంజూరు చేసే పథకాలకు మ్యాచింగ్​ గ్రాంటు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో నేతన్నలు తీవ్రంగా నష్టపోయారు. మొత్తం ఆరు దశల్లో పనిచేసే నేత కార్మికులందరి జీవితాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యాయి. అందుకే ప్రభుత్వంపై చేనేతలు గుర్రుగా ఉన్నారు.

రుణాల ఊబిలో 93.4 శాతం కుటుంబాలు..

ఇంకా సెంటు భూమి లేకుండా కౌలు మీదనే ఆధారపడ్డ రైతులు 18 లక్షల మంది ఉన్నారు. వీళ్ల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లుంది. గతంలో ఉన్న కౌల్దారీ చట్టానికి అదనంగా కొన్ని నిబంధనలు చేర్చడంతో కనీసం రైతు భరోసా కూడా దక్కడం లేదు. సంస్థాగత పంట రుణాలు పొందలేకపోతున్నారు. చివరకు పంట నష్ట పరిహారానికీ నోచుకోవడం లేదు. ప్రతి ఏటా కన్నీటి సాగు చేస్తూ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతున్నారు. భరించలేని వాళ్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఆక్స్​ఫామ్​ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలోని 93.4 శాతం కుటుంబాలు రుణాల ఊబిలో చిక్కుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధి విధానాల మూలంగానే తమకీ గతి పట్టిందని ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

వైసీపీ శ్రేణుల్లో ఆందోళన..

ప్రభుత్వం నాలుగేళ్లలో సుమారు రూ. 2.6 లక్షల కోట్లను నగదు బదిలీ పథకాల ద్వారా ప్రజలకు అందించామని గొప్పగా చెబుతోంది. గత ప్రభుత్వం సంక్షేమానికి ఏటా సుమారు రూ. 50 వేల కోట్లకు పైగా వెచ్చించింది. టీడీపీ సర్కారు కొద్ది సంఖ్యలో స్వయం ఉపాధికి ఊతమిస్తూ పథకాలను అనుసంథానించింది. వైసీపీ సర్కారు యువత స్వయం ఉపాధిని పాతరేసింది. సంక్షేమ బడ్జెట్​ నిధులనే ఎక్కువ మందికి నేరుగా అందిస్తోంది. పథకాల నగదు అందుకుంటున్న 90 శాతానికిపైగా ప్రజలు ఆ మొత్తాన్ని రోజువారీ కుటుంబ అవసరాలకే వెచ్చిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా వేస్తోన్న భారాల ముందు పథకాలు దిగదుడుపుగా మారాయి. అందుకే సగటు ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. లోపాలన్నీ సీఎం దగ్గర పెట్టుకొని ఎమ్మెల్యేలను, ఇన్​చార్జులను నిందించి ప్రయోజనమేంటని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అంతా బావుందంటూ ఇంటింటికీ వెళ్లి టముకు వేసినా ప్రజల్లోని అసంతృప్తిని, ఆక్రోశాన్ని తగ్గించగలమా అనేది వైసీపీ శ్రేణుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.

Tags:    

Similar News