Heavy Rains Effect:లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలింపు

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య అధికారులను ఆదేశించారు.

Update: 2024-10-14 13:39 GMT

దిశ ప్రతినిధి,తిరుపతి: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం తెల్లవారుజాము నుంచి వర్షాలు పడుతుండడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రధాన మురుగునీటి కాలువలు, ముఖ్యంగా పేరూరు చెరువు నుండి నీరు వచ్చే ప్రాంతాలను, నగరంలో కపిలతీర్థం, మాల్వాడి గుండం నుంచి నీరు వెళ్లే ప్రాంతాలను, లోతట్టు ప్రాంతాలైన కోరమేనుగుంట, గొల్లవానిగుంట, జీవకోన ప్రాంతాలను ఇంజినీరింగ్, హెల్త్, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. నగరంలో ఎక్కడ వర్షపు నీరు నిలవకుండా సజావుగా వెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.

పేరూరు, కపిలతీర్థం, మాల్వాడి గుండం నుంచి నీరు నగరంలోని ఎక్కువ రావడంతో నీరు నిలిచిపోతున్నాయని గతంలో జరిగిన సంఘటనలను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తుఫాను కారణంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మురుగు కాలువల్లో వర్షపు నీరు నిలవకుండా, రోడ్లపైకి నీరు రాకుండా ఎప్పటికప్పుడు చెత్త తొలగించాలని అధికారులను ఆదేశించారు. నీరు సజావుగా వెళ్లేలా తగు చర్యలు చేపట్టాలని అన్నారు. కపిలతీర్థం, మాల్వాడి గుండం ప్రధాన కాలువలతో పాటు పలు ప్రాంతాల్లో కాలువలపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు తొలగింపుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు మీ ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.


Similar News