చంద్రబాబుపై చేసిన ఆరోపణలను నిరూపిస్తారా.? సీఐడీకి పయ్యావుల కేశవ్ ఛాలెంజ్

చంద్రబాబును అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

Update: 2023-09-15 14:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబును అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. చేయని నేరానికి ఆయనను జైల్లో వేశారని,  ఏపీ సీఐడీ కోర్టులను సైతం తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. అసత్యాల్ని విపరీతంగా ప్రచారం చేశారని, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సంజయ్ లు కలిసి చంద్రబాబుపై విపరీతమైన అసత్యాలు వల్లెవేశారన్నారు. సీమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్ వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి, సీమెన్స్ కి సంబంధం లేదని నిరూపించగలరా? అని ప్రశ్నించారు.  సీమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్ వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేక దేశాల్లో ఉందని, సీమెన్స్ కి, సీమెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధం లేదని ఎలా చెప్పగలరని ప్రశ్నించారు.

'మా ఇంటికి బోర్డు పెట్టుకుంటే నీవు ఊరుకుంటావా? అని సీఐడీనే ప్రశ్నించింది. ఒక దొంగ ట్రాఫిక్ యూనిఫామ్ వేసుకొని ట్రాఫిక్ చలానా వసూలు చేస్తే ఊరుకుంటారా? వారం లోపలనే పట్టుకుంటారు. సీమెన్స్ ఏజీ సంస్థ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కన్నా ఆరు రెట్లు ఎక్కువ రెట్లు వ్యాపారం చేస్తోంది. అలాంటి సంస్థ పేరు వేరేవారు వాడుకుంటే ఆ సంస్థ చూస్తూ ఊరుకుంటుందా? ఇవన్నీ ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి అంత పరిజ్ఞానం లేదనిపిస్తోంది. చంద్రబాబుపై బురద చల్లాలని వైసీపీ నాయకుల మాటలు విని తప్పుడు సమాచారాన్ని పదే పదే చెబుతున్నారు. సీమెన్స్ ఏజీ మాకు లేఖ రాసిందని తప్పుడు సమాచారమిస్తున్నారు. రాసి ఉంటే ఆ లేఖను వెంటనే బయట పెట్టాలి. వారి స్టాక్ హోల్డింగ్ రిపోర్టు కూడా బయట పెట్టాలి. టీడీపీ నాయకుల బ్యాంక్ అకౌంట్లు వైసీపీ నాయకులు తెలుసుకున్నట్లు ఇది కూడా తెలుసుకోవాలి. సీమెన్స్ ఏజీ వెబ్ సైట్ కెళ్లి అఫిషియల్ డాక్యుమెంట్ తీసుకోవాలి' అని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.

'ఏపీలోనే కాకుండా హైదరాబాద్ లో కూడా సీమెన్స్ విషయంలో చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సీమెన్స్ అనేది ఒరిజనల్ సంస్థ. ప్రభుత్వానికి స్కిల్ డెవలప్ మెంట్ పై అవగాహన లేదు. చంద్రబాబుతోనే కాదు రాష్ట్రంలోని యువతీ యువకుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంది. ప్రభుత్వం చేసిన ఈ నష్టంతో ఇంకో కంపెనీ ఆంధ్ర రాష్ట్రం వైపు తిరిగి చూడదు. చంద్రబాబు యువతకు ఉద్యోగాలు రావాలనే తపనతో పనిచేశారు. వైసీపీ దీన్ని బూడిదపాలు చేసింది. వైసీపీ ప్రభుత్వం యువకుల జీవితాలలో నిప్పులు పోసింది. సాఫ్ట్ వేర్ తిరుగుబాటు వచ్చినప్పుడు భారత దేశంలో ఏ రాష్ట్రంలో చేయకపోయినా ఏపీలో చంద్రబాబు రిస్క్ తీసుకున్నారు. 350 ఇంజనీరింగ్ కాలేజీలకు ఒకేసారి పాలసీ పెట్టించారు. ఆరోజుల్లో 350 కాలేజీలు ఇవ్వడంతో నేడు ప్రపంచ వ్యాప్తంగా పేదవారి పిల్లలు పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఇలాంటి ఆలోచనలు ఊహకు కూడా రావు' అని విమర్శించారు.

సీఐడీ, జగన్ సర్కార్ లేవనెత్తిన అన్ని ఆరోపణలను ఆధారాలతో సహా ఎండగడతామని పయ్యావుల కేశవ్ అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు సంబంధించి మొత్తం 35 డాక్యుమెంట్ల ద్వారా సీఐడీ సంజయ్, పొన్నవోలు, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్నీ అవాస్తవాలనీ ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు. నేడు తాను బయట పెట్టిన అంశాలపై బహిరంగంగా గానీ, మీడియా సమక్షంలో గానీ చర్చకు వచ్చే దమ్ము, ధైర్యం సజ్జలకు, సీఐడీ చీఫ్ సంజయ్ కు ఉందా? అని సవాల్ చేశారు.


Tags:    

Similar News