BREAKING: టీడీపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన.. ఒక్కమాటతో తేల్చేసిన జనసేనాని
పొత్తు ధర్మం పాటించకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా మండపేట, అరకు అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించడంతో జనసేన-టీడీపీ కూటమిలో
దిశ, వెబ్‌డెస్క్: పొత్తు ధర్మం పాటించకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా మండపేట, అరకు అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించడంతో జనసేన-టీడీపీ కూటమిలో లుకలుకలు తలెత్తాయి. టీడీపీ ఏకపక్షంగా అభ్యర్థుల పేర్లను ఎనౌన్స్ చేయడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ తీరుతో జనసేన నేతలు ఆందోళన చెందారని.. తమతో చర్చించకుండా అభ్యర్థులను ప్రకటించడంతో టీడీపీ తీరును పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. సీట్ల పంపకాల్లో టీడీపీ, జనసేన పార్టీల మధ్య తేడాలు రావడంతో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా..? ఇక్కడితో పొత్తుకు ఫుల్ స్టాప్ పెట్టి ఎవరి దారి వారు చూసుకుంటారా..? ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతారా..? అనే చర్చలు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో షూరు అయ్యాయి.
టీడీపీ తీరు తప్పుబడుతూ జనసేనాని చేసిన ఈ కామెంట్స్ ఆ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. పొత్తుల్లో భాగంగా టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఒక మాట అటున్నా.. ఇటున్నా కలిసే ఎన్నికలకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల దగ్గరే పొత్తు ఆగిపోదని.. భవిష్యత్‌లో కూడా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని క్లారిటీ ఇచ్చారు. పొత్తులో చిన్న చిన్న సమస్యలు రావడం సహజమని.. వాటిని పరిష్కరించుకుని ముందుకు వెళ్తమన్నారు. కొందరు నేతలు పొత్తును ఇబ్బందులకు గురి చేసేలా మాట్లాడుతున్నారని.. ఎన్నికలకు ముందు అలా మాట్లాడటం సరికాదని పవన్ హితవు పలికారు. టీడీపీ- జనసేన కలిస్తే బలమైన నిర్మాణం చేసుకోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం, సీట్ల పంపకాల విషయం జనసేన నేతలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు తీసుకోవాలో తనకు తెలుసని అన్నారు.