తండ్రీకూతురుని విడదీసే వ్యక్తిని కాదు.. ముద్రగడ క్రాంతి వీడియోపై స్పందించిన పవన్
ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి విడుదల చేసిన వీడియోపై పవన్ కల్యాణ్ స్పందించారు...
దిశ, వెబ్ డెస్క్: కాపు సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన కూతురు క్రాంతి జనసేన పార్టీకి మద్దతు తెలిపారు. అంతేకాదు ఓ వీడియోను విడుదల చేశారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ముద్రగడ పద్మనాభంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన కుమార్తె వీడియోపై స్పందించిన ముద్రగడ పద్మనాభం.. ‘ నాకూ, నా కూతురి మధ్య చిచ్చు పెట్టాలని కొందరు చూస్తున్నారు. జగన్‌కు సేవకుడిగా ఉంటా. ఎవరు బెదిరించినా బయపడను.’ అని చెప్పారు.
అయితే ముద్రగడ క్రాంతి వీడియో, పద్మనాభం కామెంట్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ముద్రగడ పద్మనాభం, ఆయన కుమార్తెను విడదీసే వ్యక్తిని కాదని, పెద్దలు ఏదో అంటుంటారని, వాటిని పడాలని పవన్ వ్యాఖ్యానించారు. కాకినాడ జిల్లా తునిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన సీఎం జగన్ పాలనపై విమర్శలు కురిపించారు. మూడు కబ్జాలు, ఆరు సెటిల్‌మెంట్లు అంటూ సెటైర్లు వేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే పొత్తులు పెట్టుకున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోపే ఉద్యోగులకు భద్రత కల్పిస్తామన్నారు. తుని నుంచి విశాఖకు లోకల్ రైలు సదుపాయం కోసం కృషి చేస్తామని చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి, సాగు, తాగునీరు, శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.