స్వరం మార్చిన పవన్.. టీడీపీతో పొత్తుపై పునరాలోచనలో జనసేనాని..?
జనసేన అధినేత పవన్ స్వరం మారింది. బాడీ లాంగ్వేజ్ కూడా బాగా మారిపోయింది.
జనసేన అధినేత పవన్ స్వరం మారింది. బాడీ లాంగ్వేజ్ కూడా బాగా మారిపోయింది. ధరించే దుస్తుల విషయంలోనూ కాస్త కొత్తదనాన్ని చూపిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే ఆయన ఆలోచనలో మార్పు వచ్చిందా?, పొత్తుల విషయంలో పునరాలోచనలో పడ్డారా? గతంలో సీఎం పదవి అవసరం లేదని అన్న ఆయన, తాజాగా పిఠాపురం పాదగయ సాక్షిగా ఆ అవకాశం ఇవ్వండి అనడం వెనుక మర్మమేమిటీ?, పొత్తులు తేలకుండానే పిఠాపురంలో పోటీకి సన్నద్దం అవ్వడం వెనుక ఉద్దేశ్యం ఏమిటీ అని అనేక ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి కాకినాడ జిల్లాలో పవన్ ప్రసంగంలో కొత్తదనం వచ్చింది. ఖచ్చితంగా ఆయన ఒంటరి పోరుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కనీసం 30 చోట్ల అయినా గెలిస్తే కింగ్ మేకర్ అవ్వవచ్చని ఉద్దేశ్యంలో పవన్ ఉన్నట్లు సమాచారం.
దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి: గతంలో పవన్ ప్రసంగంలో యువత సీఎం.. సీఎం.. అంటూ కేరింతలు కొడుతూ ఉంటే పవన్ వారించేవారు. పదవి అవసరం లేదని కేవలం ప్రశ్నించడానికే రాజకీయాలకు వచ్చానని అనే వారు. కానీ, ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పవన్ ప్రసంగం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా పిఠాపురంలో ఆయన మాట్లాడుతూ.. తనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా సుపరిపాలన చేస్తానని ప్రకటించేశారు.
దీన్నిబట్టి చూస్తే ఆయన సొంతంగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఆయన వేషధారణనూ పూర్తిగా మార్చి వేశారు. జనంలో కొత్తగా కనపడాలనే ఉద్దేశ్యంతో సాదా సీదా హాఫ్ హ్యాండ్స్ చొక్కా, మామూలు ప్యాంటు ధరించి వారాహీలో ప్రసంగించారు. జనంలో బాగా మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో చేస్తున్న అరాచకాల గురించి వివరంగా చెబుతున్నారు. అన్ని కులాల వారిని ఆకట్టుకొనే పనిలో పడ్డారు. కాకినాడ సభలో రెల్లి కులానికి చెందిన దంపతులను దగ్గరికి పిలిచి మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు.
కింగ్ మేకర్ కోసమేనా..?
పవన్‌లో కొత్త దనం చూస్తుంటే రాష్ట్రంలో కింగ్ మేకర్ అవ్వాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. 90 సీట్లు ఎవరు తెచ్చుకొంటే వారే ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తారు. కానీ ముక్కోణపు పోటీలో ఎవరికీ అన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేదన్న భావన విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో జనసేన అభ్యర్థులను రాష్ట్రంలో దాదాపుగా 100 పైచిలుకు స్థానాల్లో పోటీ చేయించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తుంది. కనీసం 30 సీట్లలో అయినా విజయం సాధిస్తే కింగ్ మేకర్ అవ్వవచ్చనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. గోదావరి జిల్లాలో పవన్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. 34 సీట్లు ఇక్కడే ఉన్నాయి. కనీసం 25 సీట్లలో గెలిచినా, మిగతా జిల్లాలో కనీసం పది సీట్లు అయినా వస్తాయనే నమ్మకంలో ఉన్నారు.
భవిష్యత్తుకు పునాది
సొంతంగా పోటీ చేస్తే కేడర్‌లో గందర గోళం ఉండదు. పోటీ చేసే నియోజకవర్గాల్లో అభ్యర్థి గెలిచినా ఓడినా, పార్టీ మాత్రం బలంగా ఉంటుంది. 2029 ఎన్నికల నాటికి వారు మరింత స్ట్రాంగ్ అవుతారు. పొత్తులు పెట్టుకోవడం, సీఎం పదవి కోసం వాటాలు పంచుకోవడం అవసరమా అనే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్లు సమాచారం. పార్టీకి పెద్ద దిక్కు అయినా మాజీ మంత్రి హరిరామ జోగయ్య కూడా ఇదే సలహా ఇస్తున్నారు. పొత్తులకు ఆయన ససేమిరా అంటున్నారు. అయితే భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.