Minister Nadendla: రైతు కుటుంబాల్లో పండగ శోభ తెచ్చాం.. మంత్రి నాదెండ్ల
రైతు కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం పండుగ శోభను తీసుకొచ్చిందిని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla) అన్నారు.
దిశ వెబ్‌డెస్క్: రైతు కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం పండుగ శోభను తీసుకొచ్చిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla) అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం (YCP Government) కేవలం 2 లక్షల మంది రైతుల నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేసిందని ఆరోపించారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను వారు ఏనాడు పట్టించుకోలేదని తెలిపారు. గత ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ సక్రమంగా వారికి డబ్బు వారి ఖాతాల్లో జమ చేయలేదని అన్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,15,066 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. నిన్నటి వరకు 27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని స్పష్టం చేశారు. ధాన్యం సేకరించిన 24 గంటల లోపే రైతుల ఖాతాల్లో సొమ్ము కూడా జమ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు రూ.6,083.69 కోట్లను రైతుల ఖాతాల్లో వేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.