AP News:ఆరోగ్యశ్రీ పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలి.. మాజీ మంత్రి డిమాండ్

ప్రజారోగ్యం పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు పెండింగ్‌ బిల్లులు చెల్లించడంలో ఉదాసీనంగా వ్యవహరించడం తగదని మాజీ మంత్రి విడదల రజని ఆక్షేపించారు.

Update: 2025-01-07 14:47 GMT

దిశ ప్రతినిధి, గుంటూరు: ప్రజారోగ్యం పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు పెండింగ్‌ బిల్లులు చెల్లించడంలో ఉదాసీనంగా వ్యవహరించడం తగదని మాజీ మంత్రి విడదల రజని ఆక్షేపించారు. తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆమె,పేద ప్రజలు అనారోగ్యం పాలైతే మానవతా దృక్పథంతో ఆదుకోవాలే తప్ప ట్రస్ట్‌ మోడల్‌లో ఉన్న ఆరోగ్యశ్రీని హైబ్రిడ్‌ మోడల్‌లోకి మార్చడం తగదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని మార్చుకోకపోతే ప్రజల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు.

అది సంక్షేమ పథకం కాదు..

పేదల ఆరోగ్యాన్ని కాపాడే సంజీవని లాంటి పథకం ఆరోగ్యశ్రీ. అనారోగ్యంతో బాధపడుతూ, వైద్యం కోసం అప్పుల పాలవుతున్న పేదలను ఆదుకునేందుకు తెచ్చిన ఒక గొప్ప పథకం. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఒక సంక్షేమ పథకంగా చూడలేం. దివంగత వైఎస్సార్‌ మానవత్వంతో రూపొందించిన ఆ కార్యక్రమాన్ని ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ గారు మరింత ముందుకు తీసుకెళ్లారు. తండ్రీ తనయులిద్దరూ రాష్ట్ర ప్రజల ఆరోగ్య బాధ్యత ప్రభుత్వానిదే అన్నట్లు భావించి, మానవతా దృక్పథంతో ఆలోచించి పని చేశారు.

ఆరోగ్యశ్రీలో జగన్‌ గారు విప్లవాత్మక మార్పులు..

2019లో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి ఆరోగ్యశ్రీలో కేవలం 1,059 ప్రొసీజర్లనే అనుమతించారు. కానీ, జగన్‌గారు ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లను 3257కు పెంచారు. 919 నెట్‌వర్క్‌ ఆస్పత్రులను 2300కు పెంచారు. రూ.1000 ఖర్చు దాటిన ప్రతి వైద్యాన్ని పథకంలో చేర్చారు. పథకంలో కవరేజ్‌ను రూ.25 లక్షల వరకు పెంచారు. పథకంలో అర్హతకు వార్షికాదాయం పరిమితిని రూ.5 లక్షలకు పెంచడంతో, రాష్ట్రంలోని దాదాపు 1.5 కోట్ల కుటుంబాల్లో 95 శాతం ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయి. ఇవన్నీ ఆరోగ్యశ్రీలో జగన్‌గారు తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు. కోవిడ్‌ను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి దానికి సంబంధించి దాదాపు 10 ప్రొసీజర్లను పథకంలో అనుమతించిన గొప్ప మనసు జగన్‌గారిది. 2019లో చంద్రబాబు దిగిపోతూ, ఆరోగ్యశ్రీ కింద నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రూ.632 కోట్లు బకాయి పెట్టిపోతే ఆ మొత్తం కూడా వైయస్సార్‌సీపీ ప్రభుత్వం చెల్లించింది. వైద్యం కోసం ఏ ఒక్క నిరుపేద కుటుంబం ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో, జగన్‌గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆ స్థాయిలో తీర్చిదిద్ది అమలు చేశారు.

6 నెలల్లోనే ఆరోగ్యశ్రీ నిర్వీర్యం..

టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఏకంగా రూ.3 వేల కోట్లు బకాయి పెట్టడంతో, అవన్నీ వైద్యాన్ని నిలిపేశాయి. మరోవైపు హైబ్రిడ్‌ విధానంలో పథకాన్ని అమలు చేస్తామంటూ, ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు అప్పగించే పని మొదలు పెట్టారు. ఇది నిరుపేద రోగులకు శాపంగా మారనుంది. గత మా ప్రభుత్వంలో ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద చేసిన ఖర్చు దాదాపు రూ.13,500 కోట్లు కాగా, 2014–19 మధ్య అందు కోసం టీడీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు కేవలం రూ.5,100 కోట్లు మాత్రమే.

హైబ్రిడ్‌ మోడల్‌తో ప్రజలకు నష్టం..

మా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలు ఆరోగ్యశ్రీ పథకం కిందికి రాగా, దాదాపు 90 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ట్రస్టు మోడల్‌ కింద సేవలందించడం జరిగింది. కాగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీకి పథకాన్ని అప్పగించాలని చూడటం అత్యంత దుర్మార్గం. లాభాపేక్షతో పని చేసే ఇన్సూరెన్స్‌ కంపెనీలకు ఆరోగ్యశ్రీ ట్రస్టు పనులు అప్పగిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని ఎలా నమ్మగలం?. ఆరోగ్యశ్రీ సంక్షేమ పథకం కాదు. గతంలో మహారాష్ట్ర, కేరళలో ఇలాగే హైబ్రిడ్‌ మోడల్‌ను ప్రయత్నించి విఫలం కావడంతో మళ్లీ ట్రస్టు మోడల్‌లోకి వచ్చిన ఉదాహరణలుంటే.. వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా ప్రభుత్వం ఆ విధానం అమలు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి?. ఆపరేషన్‌ తర్వాత, వైద్యులు సూచించినంత కాలం విశ్రాంతి సమయంలో రోగికి రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.5 వేలు చెల్లిస్తూ, మా ప్రభుత్వం అమలు చేసిన ఆరోగ్య ఆసరాను కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం నిలిపేసింది. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని సమీక్షించి ఆరోగ్యశ్రీలో హైబ్రిడ్‌ విధానానికి స్వస్తి చెప్పి, ట్రస్టు మోడల్‌నే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నాం. ప్రభుత్వం ఇలాగే ఉదాసీనంగా వ్యవహరిస్తే ప్రజల పక్షాన వైయస్సార్‌సీపీ ఉద్యమిస్తుందని మాజీ మంత్రి విడదల రజని హెచ్చరించారు.


Similar News