కేంద్ర బడ్జెట్ అద్భుతంగా ఉంది.. తెలుగు రాష్ట్రాలకు నిరాశ వాస్తవమే: పవన్ కల్యాణ్
దిశ, ఏపీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ, వామపక్షాలు విమర్శలు కురిపిస్తుంటే.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాత్రం భిన్నంగా స్పందించారు. బడ్జెట్ అద్భుతంగా ఉందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసేదిశగా కేంద్రం ప్రయత్నిస్తోందని బడ్జెట్‌ను పరిశీలిస్తే తెలుస్తోందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఉత్పాదక, వ్యవసాయ రంగాలను బలోపేతం చేయడం ద్వారా దేశ ప్రగతిని ముందుకు తీసుకువెళ్లే విధంగా ఈ బడ్జెట్‌ను కేంద్రం రూపకల్పన చేయడం మంచి పరిణామమన్నారు. ఈ బడ్జెట్ తెలుగు రాష్ట్రాలను నిరాశపరిచింది వాస్తవమేనంటూ అసహనం వ్యక్తం చేశారు. ఏపీకి సంబంధించి విభజన హామీలు, పోలవరం ప్రాజెక్ట్ వంటి అంశాల ప్రస్తావన బడ్జెట్‌లో లేకపోవడం కొంత నిరాశ కలిగించిందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
అయితే అభివృద్ధి చెందిన దేశాలతో మన భారతదేశం పోటీ పడే విధంగా బడ్జెట్ రూపొందించారని.. ఇది భవిష్యత్‌లో మంచి ఫలితాలు ఇస్తుందని తెలిపారు. 'ప్రధానమంత్రి గతిశక్తి బహుళార్ధక పథకం దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇచ్చే విధంగా ఉంది. ముఖ్యంగా డిజిటల్ కరెన్సీ, డిజిటల్ బ్యాంకింగ్ కారణంగా వ్యాపార వ్యవహారాలు, నగదు లావాదేవీల్లో పారదర్శకత పెరిగి అవకతవకలు తగ్గే అవకాశం ఉంది'అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. 'డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు కారణంగా దేశ సాంకేతిక అవసరాలు తీర్చగల మంచి ప్రమాణాలు కలిగిన టెక్కీలు రూపొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజలపై కొత్తగా పన్నుల భారం వేయకుండా బడ్జెటును రూపొందించిన ప్రధాని నరేంద్రమోడీకి, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు జనసేన పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆదాయపు పన్ను పరిమితిని ఈసారి బడ్జెట్లో పెంచుతారని ఎదురుచూసిన ఉద్యోగులు నిరాశకు గురయ్యారు. అలాగే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక కేటాయింపులు చేసి ఉంటే బాగుండేది అని జనసేన పార్టీ భావిస్తోందని జనసేనాని పవన్ కల్యాణ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.