వైసీపీ కుట్రలో చిక్కుకోవద్దు.. పెద్ద కాపులకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు
కాపు సామాజిక వర్గం నేతలకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు. ...
దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఆయన సామాజిక వర్గమే టార్గెట్‌గా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు వస్తుండటంతో కాపు సామాజిక వర్గాన్ని చంద్రబాబు వద్ద పవన్ తాకట్టు పెట్టారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు ఎన్నికల్లో గెలిస్తే పవన్‌కు చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం ఇస్తారా అంటూ ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. పవన్ తన సామాజికి వర్గాన్ని మోసం చేస్తున్నారని వైసీపీ నాయకులు పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు. అటు పవన్‌కు దీటుగా కాపు సామాజిక వర్గం నేతలను రంగంలోకి దింపి మరీ ఆయనపై వైసీపీ అధిష్టానం విమర్శలు చేయిస్తోంది.
ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం నేతలకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారు. వైసీపీ రెచ్చగోడుతోందని, ఆ పార్టీ కుట్రలో ఎవరూ చిక్కుకోవద్దన్నారు. కాపు పెద్దలు తనను దూషించినా దీవెనగానే తీసుకుంటానని చెప్పారు. కాపు పెద్దలకు జనసేన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కాపులు పెద్దన్నలుగా నిలవాలని పిలుపునిచ్చారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా బలమైన హేతువుగా ఉంటుందని పేర్కొన్నారు. జనసేన, టీడీపీ పొత్తుకు ప్రధాని మోడీ ఆశీస్సులు ఉన్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.