పవన్ కల్యాణ్ దూకుడు: కో ఆర్డినేషన్ కమిటీ ప్రకటన
తెలుగుదేశం పార్టీతో పొత్తును జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీతో పొత్తును జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ములాఖత్‌లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసిన అనంతరం పవన్ కల్యాణ్ పొత్తును ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కలిసే వెళ్తామని ప్రకటించారు. టీడీపీ పొత్తు విషయంలో కాస్త దూకుడుగా ఉన్న పవన్ కల్యాణ్ తాజాగా ఈ పొత్తుల వ్యవహారంలో మరింత దూకుడు పెంచారు. ఉమ్మడి కార్యచరణకు సంబంధించి కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తామని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి కార్యచరణ ఏర్పాటుకు సంబంధించి పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారు. సీట్లు, సర్ధుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో ఇతర అంశాలపై చర్చించుకునేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీలైనంత త్వరగా కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని ఇప్పటికే టీడీపీకి పవన్ కల్యాణ్ సూచించిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ నుంచి ఇంకా సభ్యుల ఎంపిక ప్రక్రియ కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ మెుదటగా జనసేన పార్టీ తరఫున సభ్యులను ప్రకటించారు.
కోఆర్డినేషన్ కమిటీ ఇదే
టీడీపీతో సమన్వయం కోసం జనసేన పార్టీ నుంచి ఐదుగురు సభ్యుల కమిటీని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ కమిటీకి పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చైర్మన్‌గా వ్యవహరించనున్నట్లు ప్రకటించారు. ఇకపోతే పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్ రెడ్డి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కందుల దుర్గేష్, పార్టీ జనరల్ సెక్రటరీ పాలవలస యశస్విని, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, జనసేన పార్టీ మత్స్యకార వికా స విభాగం చైర్మన్ బొమ్మిడి నాయకర్‌లను సభ్యులుగా నియమిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.