నామినేటెడ్ పోస్టుల భర్తీకి క‌స‌ర‌త్తు షురూ!

నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి కూట‌మి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గతంలో మాదిరిగా కాకుండా మండల స్థాయి నుంచి నామినేటెడ్‌ పోస్టుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది.

Update: 2024-07-15 02:05 GMT

దిశ, ఏపీ బ్యూరో:నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి కూట‌మి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గతంలో మాదిరిగా కాకుండా మండల స్థాయి నుంచి నామినేటెడ్‌ పోస్టుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. మూడు పార్టీల కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన క్రమంలో ప్రతి నామినేటెడ్‌ పోస్టు భర్తీలో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏ పార్టీకీ ఇబ్బంది లేకుండా సమన్వయం చేసేందుకు వీలుగా మొత్తం నామినేటెడ్‌ పోస్టుల వివరాలను సేకరిస్తోంది. ఇప్పటికే కొంత సమాచారాన్ని ఉన్నతాధికారులు తెప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో మండల స్థాయిలో పోస్టుల వివరాలు కూడా పంపించాలని అన్ని శాఖల ఉన్నతాధికారులకు సీఎంవో నుంచి సర్క్యులర్‌ పంపించారు.

గత పదేళ్లలో ఏయే నామినేటెడ్‌ పోస్టులు భర్తీ అయ్యాయి? ఎవరు ఆయా పోస్టుల్లో ఉన్నారు? ఎంత కాలం ఉన్నారు? ఎన్ని ఖాళీలున్నాయన్న సమాచారం పంపించాలని సూచించారు. ఈ మేరకు జీఏడీ సేవల సెక్రటరీ పోలా భాస్కర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నేడు రాష్ట్ర స‌చివాల‌యంలో జరిగే సమావేశానికి ఆయా పోస్టుల వివరాలను అందించాలని ఆదేశించారు. ఈ స‌మావేశానికి ప్రతి విభాగం నుంచి ఒక అధికారిని డేటాతో పంపించి వివరాలను అందించాలని ఈ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారికి, కూట‌మి పొత్తులో భాగంగా పోటీ చేసే అవ‌కాశం లేకుండాపోయిన‌వారికి, పార్టీ గెలుపుకోసం కృషి చేసిన వారికీ నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీలో పెద్ద‌పీట వేయాల‌ని కూట‌మి నేత‌లు భావిస్తున్నారు. ఇందుకోసం గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల పార్టీ కార్య‌క‌ర్త‌ల ఫీడ్ బ్యాక్‌ను తీసుకుంటున్నారు.


Similar News