‘ఆ తప్పు వల్లే నష్టాల్లో విశాఖ ఉక్కు..’ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ హాట్ కామెంట్స్

Update: 2024-09-28 08:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ ఉక్కుపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ హాట్ కామెంట్స్ చేశారు. విశాఖ ఉక్కు అనేది ఏపీ ప్రజల సెంటిమెంట్ అని, వాళ్ల సెంటిమెంట్‌ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. విశాఖ ఉక్కుపై కొద్ది రోజులుగా కేంద్ర మంత్రులతో చర్చిస్తున్న శ్రీనివాసవర్మ తాజాగా మీడియాతో మాట్లాడారు. ‘‘విశాఖ ఉక్కు పరిశ్రమని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చ జరిగింది. విశాఖ ఉక్కు ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ క్రమంలోనే అనేక ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నాం. దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని భావిస్తున్నాం. ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతినకుండా ముందుకెళ్లే ఆలోచన చేస్తున్నాం. సెయిల్ అధికారులతో చర్చించాం. సెయిల్ ఆధ్వర్యంలో కంపెనీలన్నీ లాభాల్లో ఉన్నాయి. విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేసే అంశంలో అనేక టెక్నికల్ సమస్యలున్నాయి.

అనంతరం కార్మికుల ఆందోళనపై స్పందిస్తూ.. ఏదైనా పరిశ్రమని డిజిన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నప్పుడు కార్మికులు ఆందోళన చెందడం సహజం. వాళ్ల కుటుంబానికి భద్రత ఉండాలనే ఆలోచన వారికి ఉండడం కూడా సహజం. కానీ ఇందులో సాధ్యాసాధ్యాలను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఉద్యోగస్థులను కానీ, కార్మికులను కానీ తప్పు పట్టడం లేదు. వాళ్లు చాలా సిన్సియర్‌గా పని చేస్తున్నారు. గతంలో ఉండవలసిన దానికంటే చాలా అదనంగా ఉద్యోగస్థులను రిక్రూట్ చేసుకోవడం వల్లే సమస్య తలెత్తింది. బెలాయి, బొకారో, లాంటి మిగతా పరిశ్రమలతో పాటు సెయిల్ యూనిట్స్‌లో కార్మికులు, ఉద్యోగుల సంఖ్యతోపాటు అక్కడి ఉత్పత్తిపై అధ్యయనం చేశాం. దాంతో పోల్చితే విశాఖ స్టీల్‌‌ పరిశ్రమలో ఎక్కువమంది కార్మికులున్నారు. దీనికి కార్మికులను తప్పు పట్టడం లేదు. కానీ దీనివల్ల సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది’’ అని శ్రీనివాస వర్మ అన్నారు.


Similar News