డిక్లరేషన్ రాసుకుంటే రాసుకోండి.. చంద్రబాబు, పవన్‌పై జగన్ ఫైర్
తన కులం.. నా మతం ఏంటో ప్రజలకు తెలియదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు...
దిశ, వెబ్ డెస్క్: తన కులం, మతం ఏంటో ప్రజలకు తెలియదా అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. తిరుమల పర్యటన రద్దు సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్లు తిరుమల స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారని జగన్ గుర్తు చేశారు. తాను ఆయన కుమారుడినే కదా అని ప్రశ్నించారు. తన పాదయాత్ర ముగిసిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు. ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వమే ఉందన్నారు. తాను ముఖ్యమంత్రి అయినా తర్వాత కూడా తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్న విషయాన్నీ జగన్ గుర్తుచేశారు. తిరుమలకు తాను వెళ్లకూడదని ఇప్పుడు నోటీసులు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘నా మతం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంట్లో బైబిల్ చదువుతా. బయట హిందు, ఇస్లాం, సిక్కు మతాలను గౌరవిస్తా. నా మతం ఏంటని అడుగుతున్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్ రాసుకుంటే రాసుకోండి. సెక్యులర్ అనే పదానికి అర్థం తెలుసా?. ఒక సీఎంగా ఐదేళ్లు తిరుమల స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించా. మాజీ ముఖ్యమంత్రి అయిన నాకు ఇలాంటి పరిస్థితి దాపురించిందంటే ఇక దళితుల పరిస్థితేంటి?. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు, ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు. భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్న చంద్రబాబుపై బీజేపీ పెద్దలు ఎందుకు మిన్నకుండిపోతున్నారు. గుడికి వెళ్లాలనుకుంటే ఏ మతం అని అడుగుతున్నారు. హిందూయిజానికి తామే ప్రతినిధులమని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. చెడు చేసే వారిని నేను మంచి హిందువుగా గుర్తించను. మానవత్వం చూపడమే హిందూయిజం’’ అని జగన్ ప్రశ్నించారు.