హామీలు అమలు చేయని ఎన్డీఏది ముంచే ప్రభుత్వమే : 'తాలి బజావ్' నిరసనలో వైఎస్ షర్మిల

Update: 2024-09-25 11:49 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలను ముంచే ప్రభుత్వమేనని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 'తాలి బజావ్' కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్లేట్లపై గంటెలతో బాదుతూ...ఇది మంచి ప్రభుత్వం కాదు, సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ పరిపాలనపై విసుగెత్తి కూటమి సర్కార్‌కు అధికారం కట్టబెడితే ఈ ప్రభుత్వం కూడా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతోందన్నారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సూపర్ సిక్స్ అమలు చేయలేదన్నారు. "టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తమది మంచి ప్రభుత్వమని ఊరూరా ప్రచారం చేసుకుంటోందని.. ఇప్పటికీ సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేని ప్రభుత్వం మంచిదెలా అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం దగ్గర నిధులు లేవంటున్న ప్రభుత్వానికి ఎన్నికలకు ముందే రాష్ట్రానికి రూ.11 లక్షల కోట్లు అప్పులున్నాయని తెలియదా అని నిలదీశారు. సూపర్ సిక్స్‌లో భాగంగా 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారని.. అంటే ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలివ్వాల్సిన కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల పాలనలో ఉద్యోగాల కల్పన మీద ప్రణాళికలు కూడా రచించలేదని విమర్శించారు. ప్రభుత్వంలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిని ఎలా నింపుతారో ప్రణాళికలు లేవన్నారు.

రైతులకు సంబంధించిన పథకాలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని, రూ.20 వేలు ఇస్తామని చెప్పిన హామీ అటకెక్కించారని ఆరోపించారు.. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు 7 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే..కూటమి సర్కార్ కేవలం 2 లక్షల ఎకరాలే అని తేల్చిందని. పరిహారంపై కోత పెట్టిన ప్రభుత్వాన్ని ముంచే ప్రభుత్వం అనక తప్పదన్నారు. ప్రధాని మోదీకి రాష్ట్రమంటే మొదటి నుంచి చిన్నచూపు ఉందని, వరదల్లో సర్వస్వం కోల్పోయిన వారిని ఆదుకునేందుకు కేంద్రం నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు. రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీతో ఎందుకు జట్టుకట్టారో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. 


Similar News