గెలుపే లక్ష్యంగా నారా లోకేశ్ వ్యూహం: సంక్రాంతి తర్వాత ముహూర్తం
తెలుగుదేశం పార్టీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇక ఎన్నికలపై ఫోకస్ పెట్టారు.
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇక ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. యువగళం పాదయాత్రతో తన సత్తా ఏంటో చూపించిన నారా లోకేశ్ ఇకపై జిల్లాల వారీగా యాత్రలు చేపట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచి ప్రజల్లో ఉండేలా నారా లోకేశ్ కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు యువగళం పాదయాత్రలో 97 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టిన నారా లోకేశ్ ఈ సారి అందుకు భిన్నంగా యాత్రలు నిర్వహించబోతున్నారు. పోల్ మేనేజ్‌మెంట్‌పై నారా లోకేశ్ ప్రత్యేక దృష్టి సారించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన టీడీపీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత ఇక నారా లోకేశ్ జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇప్పటికే జిల్లాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు, క్యాడర్‌కు సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది.
రెట్టింపు ఉత్సాహంతో...
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇక ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయారు. యువగళంకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అంతేకాదు ఈ యువగళం పాదయాత్ర నారా లోకేశ్ పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా మారేందుకు ఎంతగానో ఉపయోగపడింది. అంతేకాదు ప్రజల మెచ్చే నాయకుడిగా ఎదిగేందుకు ఉపయోగపడింది. అంతేకాదు అందరి సమస్యలను వింటూ.. అందరితో మమేకమవుతూ.. నారా లోకేశ్ తాను అందరివాడనని నిరూపించుకున్నారు. అంతేకాదు 97 నియోజకవర్గాలలో నారా లోకేశ్ పాదయాత్ర చేపట్టి తన సత్తా ఏంటో నిరూపించారు. తనను విమర్శించిన వాళ్ల నోళ్లకు తాళం వేయించారు నారా లోకేశ్. అంతేకాదు యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ సైతం సక్సెస్ అయ్యింది. దీంతో నారా లోకేశ్ మరింత ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు.
సంక్రాంతి తర్వాతే
యువగళం సక్సెస్‌తో రాజకీయంగా మాంచి ఫామ్‌లో ఉన్న నారా లోకేశ్ ఇకపై జిల్లాల యాత్రలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇందుకు ముహూర్తం సైతం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సంక్రాంతి అనంతరం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 40 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ సైతం రెడీ అయినట్లు తెలుస్తోంది. ఏయే జిల్లాలలో ఎన్నిరోజులు పర్యటించబోతున్నారు.. ఎవరితో భేటీ కాబోతున్నారు అనే అంశాలకు సంబంధించి జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.
పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి
యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు తాను పాదయాత్రలో కళ్లారా చూసిన సమస్యల పరిష్కారానికి సైతం హామీలు ఇచ్చారు నారా లోకేశ్. అయితే ఈ జిల్లాల యాత్ర అందుకు భిన్నంగా ఉంటుందని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఈ జిల్లాల యాత్ర ప్రధానంగా పోల్ మేనేజ్‌మెంట్‌పై ఉంటుందని తెలుస్తోంది. బూత్ లెవెల్, మండల స్థాయి, అనుబంధ సంస్థల కమిటీలతో సంస్థాగత వ్యవహారాలపై నారా లోకేశ్ సమీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు దోహదపడే అంశాలు వైసీపీ ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టాలి... ఓటర్లను తెలుగుదేశం పార్టీవైపు ఆకర్షితులయ్యేందుకు అనుసరించాల్సిన విధానాలపై నారా లోకేశ్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.