సీఎం డిజిటల్ సంతకాన్ని ఫోర్జరీ చేసిందెవరు?: నారా లోకేష్
సీఎం జగన్ ఇంట్లోనే దొంగలు పడడమేంటీ ? సీఎం డిజిటల్ సంతకాన్ని ఫోర్జరీ చేసిందెవరు ! 225 ఫైళ్లు క్లియర్ చేయడం ద్వారా వందల కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది.
దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్ ఇంట్లోనే దొంగలు పడడమేంటీ ? సీఎం డిజిటల్ సంతకాన్ని ఫోర్జరీ చేసిందెవరు ! 225 ఫైళ్లు క్లియర్ చేయడం ద్వారా వందల కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతుంటే సీఎం పబ్జీ ఆడుకుంటున్నాడా అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఇంత పెద్ద కుంభకోణం జరిగితే అటెండర్లపై కేసులు పెట్టి దొంగలు తప్పించుకు తిరుగుతున్నట్లు లోకేష్ ఆరోపించారు. యువగళం పాదయాత్రలో భాగంగా పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించారు.
జగన్ 420 అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలు 840లు అని లోకేష్ చమత్కరించారు. రాష్ట్రానికి రాజధాని మధ్యలో ఉండాలని నాడు సీఎం జగన్‌తోపాటు జిల్లా నేతలు చెపారు. అమరావతికి జై కొట్టారు. అందుకే జగన్ ఇక్కడ ఇల్లు కట్టుకున్నట్లు చెప్పారు. గెలిచిన తర్వాత జగన్ మాట మార్చాడు. మడమ తిప్పాడు. రాష్ట్రానికి ఆయుపట్టు అయిన అమరావతిని ధ్వంసం చేశాడు. అమరావతిని శ్మశానం అన్నారు. భూకంపాలు వస్తాయన్నారు. మునిగిపోతుందంటూ అనేక అబద్దాలు వల్లె వేశారు. జగన్ కుట్రలను తట్టుకొని అమరావతి నిలబడింది. ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలకు సిగ్గుంటే.. పుట్టిన ప్రాంతంపై మమకారం ఉంటే జగన్‌ను నిలదీయాలని లోకేష్ హితవు పలికారు.
సీఎం జగన్ సంక్షేమ పథకాల పేరిట ఒక చేత్తో పది రూపాయలు ఇస్తున్నాడు. మరో చేత్తో వంద లాక్కుంటున్నాడు. ఓ వ్యక్తి రోజుకు ఓ క్వార్టర్ మందు తాగితే బాటిల్‌పై రూ.25 అదనంగా బాదేస్తున్నారు. నెలకు రూ.750, ఏడాదికి రూ.9 వేలు, ఐదేళ్లకు రూ.45 వేలు జే ట్యాక్స్ కడుతున్నట్లు లోకేష్ వెల్లడించారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం తర్వాత ఓట్లు అడుగుతానన్న సీఎం గెలిచాక లిక్కర్ కంపెనీలు, ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచినట్లు పేర్కొన్నారు. అంతకంటే ప్రమాదం ఏమంటే జగన్ లిక్కర్ విషం కంటే డేంజరన్నారు. నాలుగేళ్లలో జే బ్రాండ్ మద్యం తాగి చనిపోతున్న వాళ్ల సంఖ్య వేలల్లో ఉంటుందని లోకేష్ తెలిపారు.
గురజాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది టీడీపీ హయాంలోనేనని లోకేష్ గుర్తు చేశారు. ఐదేళ్లలో రూ. 2,265 కోట్లతో అప్పటి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. రూ.336 కోట్లతో ఆరు వేల టిడ్కో ఇళ్లు, రూ.216 కోట్లతో ఎన్టీఆర్ గృహాలు, రూ.220 కోట్లతో సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మించినట్లు లోకేష్ తెలియజేశారు. రూ.170 కోట్లతో ఆర్అండ్బీ రోడ్లు, తాగు నీటి ప్రాజెక్టులు, గురజాల, పిడుగురాళ్ల పట్టణాల అభివృద్ధికి వెచ్చించినట్లు తెలిపారు. రూ.160 కోట్లతో పుష్కర ఘాట్లు నిర్మించినట్లు లోకేష్ వివరించారు. రానున్న ఎన్నికల్లో గురజాలలో టీడీపీని గెలిపించాలని లోకేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.