తెలుగు సినీ ప్రేక్షకులకు నేడు చిరస్మరణీయ దినం.. నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు
విశ్వవిఖ్యాత నట సౌర్వభౌముడు, తెలుగు ఖ్యాతిని నలు దిశలకు చాటిన మహానటుడు నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Rama Rao) నట ప్రస్థానానికి నేటితో 75 ఏళ్లు నిండాయి.
దిశ,వెబ్‌డెస్క్: విశ్వవిఖ్యాత నట సౌర్వభౌముడు, తెలుగు ఖ్యాతిని నలు దిశలకు చాటిన మహానటుడు నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Rama Rao) నట ప్రస్థానానికి నేటితో 75 ఏళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కుమార్తె, సీఎం చంద్రబాబు(CM Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులకు, తెలుగు సినీ ప్రేక్షకులకు నేడు చిరస్మరణీయ దినం అని ఆమె పేర్కొన్నారు. 75 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు 1949 నవంబర్ 24న నాన్న గారు మొట్టమొదటిసారిగా వెండితెరపై కనిపించిన 'మనదేశం' సినిమా విడుదలైందని నారా భువనేశ్వరి వెల్లడించారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ అభిమానులకు, తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు.
"ఎన్టీఆర్ సినీ ప్రయాణం, ఆయన నటనా విశ్వరూపం తలుచుకుంటుంటే ఒక కూతురిగానే కాకుండా, ఒక తెలుగు వ్యక్తిగా నేను ఎంతో గర్విస్తాను. ముఖ్యంగా, నాన్న గారు పోషించిన పౌరాణిక చిత్రాల పాత్రలను తలచుకుంటే.. తమ రూపాలను ప్రజలకు చూపించమని ఆ దేవుళ్లే ఆయనను ఆశీర్వదించి భూమ్మీదకు పంపారేమో అనిపించి ఒళ్ళు పులకరిస్తోంది. తెలుగు ప్రజలు ఎన్టీఆర్ ను కారణజన్ముడు అన్నది కూడా అందుకేనేమో!" అని నారా భువనేశ్వరి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.