ప్రజాక్షేత్రంలోకి నారా భువనేశ్వరి: నిజం గెలవాలంటూ జనాల్లోకి..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారా?

Update: 2023-10-22 11:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో :తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారా? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ఇప్పటికే అనేక నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న నారా భువనేశ్వరి ఇక పార్టీ బహిరంగ సభలలో పాల్గొననున్నారా? చంద్రబాబు అరెస్ట్‌ను తట్టుకోలేక మృతి చెందిన వారికి అండగా నిలిచేందుకు పర్యటించబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రజలకు వివరించాలని టీడీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా నారా భువనేశ్వరిని రంగంలోకి దించాలని టీడీపీ నిర్ణయించింది. ‘నిజం గెలవాలి’పేరులో నారా భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి వెళ్లేలా టీడీపీ నాయకత్వం దిశానిర్దేశశం చేసింది. ఇందులో భాగంగా నారా భువనేశ్వరి ఇక రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. సీఎం జగన్‌ ప్రజావ్యతిరేక పాలనను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడంతోపాటు...టీడీపీ సానుభూతిపరుల ఓట్లను జాబితాల నుంచి తొలగించడం, అనర్హత ఓట్లను చేర్పించడంపై నారా భువనేశ్వరి గళం వినిపించనున్నారు. అలాగే చంద్రబాబు అరెస్టుతో మానసికంగా కుంగిపోయి మృతి చెందిన 154 కుటుంబాలను నారా భువనేశ్వరి ఓదార్చనున్నట్లు తెలుస్తోంది.

శ్రీవారిదర్శనం అనంతరం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈనెల 25 నుంచి నారా భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. వారానికి రెండు మూడు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటన ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. చిన్న చిన్న సభలు, సమావేశాల్లో కూడా ఆమె పాల్గొంటారు. భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి రావడం ఇదే ప్రథమం. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా నుంచే ఈ నిజం గెలవాలి యాత్ర ప్రారంభించనున్నారు నారా భువనేశ్వరి. భువనేశ్వరి పర్యటనకు సంబంధించి టీడీపీ అధిష్టానం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 23న తిరుపతిలో పర్యటించనున్నారు. ఈనెల 24న ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం నారావారిపల్లెలో కులదైవం నాగాలమ్మకు, గ్రామ దేవత దొడ్డి గంగమ్మకు నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేయనున్నారు. దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేయనున్నారు. ఆ తర్వాత చంద్రబాబు తల్లిదండ్రులు నారా ఖర్జురపు నాయుడు, అమ్మణ్ణమ్మల సమాధులకు నారా భువనేశ్వరి నివాళిలర్పించనున్నారు.

చంద్రగిరి నుంచే శ్రీకారం

ఇకపోతే ఈనెల 25న చంద్రగిరిలో జరిగే ‘నిజం గెలవాలి’ కార్యక్రమాన్ని భువనేశ్వరి ప్రారంభించనున్నారు. ఈ తొలి బహిరంగ సభలో నారా భువనేశ్వరి పాల్గొంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రజలను భువనేశ్వరి ప్రజలకు వివరించనున్నారు. నిజంగెలవాలి కార్యక్రమంలో భాగంగా వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను భువనేశ్వరి ఎండగట్టనున్నారు. అలాగే కుప్పంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లను జాబితాల నుంచి తొలగించడం, అనర్హత ఓట్లను చేర్పించడంపై భువనేశ్వరి ప్రజావేదికలపై ఖండించబోతున్నారు. అలాగే చంద్రబాబు అరెస్టుతో మానసికంగా కుంగిపోయి మృతి చెందిన కుటుంబాలకు పార్టీ అండగా నిలవనుంది. మృతి చెందిన వారి కుటుంబాలను నారా భువనేశ్వరి నేరుగా వెళ్లి పరామర్శించనున్నారు.

Tags:    

Similar News