ప్రజాక్షేత్రంలోకి నారా భువనేశ్వరి.. నేటి నుంచి 'నిజం గెలవాలి' యాత్ర
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిప్రజాక్షేత్రంలోకి దిగుతున్నారు. నేటి నుంచి 'నిజం గెలవాలి' పేరుతో బస్సు యాత్రను చేపట్టనున్నారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని భువనేశ్వరి దర్శించుకోనున్నారు. అనంతరం నారావారి పల్లెకు చేరుకోనున్న ఆమె.. తన పెద్దల సమాధులకు నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత నారావారిపల్లెలో గ్రామ దేవతలైన దొడ్డి గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేయనున్నారు.
బుధవారం నారావారిపల్లె నుంచి భువనేశ్వరి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ యాత్ర ద్వారా చంద్రబాబు అరెస్ట్ వార్తలతో మనస్తాపం చెంది మరణించినవారి కుటుంబాలను పరామర్శించనున్నారు. మూడు రోజుల పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ యాత్ర జరగనుండగా.. పలుచోట్ల బహిరంగ సభలు కూడా నిర్వహించనున్నారు. తిరుపతిలో కూడా బహిరంగ సభకు టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తోన్నాయి. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారనే విషయాన్ని యాత్ర ద్వారా భువనేశ్వరి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
మూడు రోజుల యాత్రలో భాగంగా చంద్రగిరి మండలం, తిరపతితో రెండుచోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తారు. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టినందుకు పోలీసులు టీడీపీ, జనసేన కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. తిరుపతిలో 26వ తేదీన వీరిని భువనేశ్వరి పరామర్శించనున్నారు.