ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ మూడు వారాలపాటు వాయిదా పడింది.

Update: 2023-09-11 09:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ మూడు వారాలపాటు వాయిదా పడింది. వివేకా హత్యకేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు కోరుతూ వైఎస్ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ కేసులో వైఎస్ సునీతారెడ్డి తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది సిద్ధార్థ లూథ్రా అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా వేయాలని సునీతా రెడ్డి కోరారు. దీంతో తదుపరి విచారణను మూడు వారాలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఇకపోతే వైఎస్ వివేకా హత్యకేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ఏ-8 నిందితుడిగా ఉన్నారు. అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైఎస్ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ సంజీవ్ ఖనా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. తన తండ్రి హత్యకు ప్రధాన సూత్రధారి అవినాశ్ రెడ్డి అని కేసు దర్యాప్తుకి సహకరించకుండా తప్పించుకుంటున్నారని పిటిషన్‌లో సునీతారెడ్డి పేర్కొన్నారు. అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారం పై ఇప్పటికే సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. వైఎస్ వివేకా హత్యకు భాస్కర్ రెడ్డి , అవినాశ్‌రెడ్డి కుట్ర చేసారంటూ సీబీఐ అఫిడవిట్‌లో పేర్కొంది. రాజకీయ వైరంతోనే వైఎస్ వివేకా హత్య జరిగిందని సీబీఐ స్పష్టం చేసింది. గుండెపోటు అంటూ కట్టుకథ అల్లారని సీబీఐ పేర్కొంది. అవినాశ్ రెడ్డి పాత్రపై ఇంకా దర్యాప్తు చేయాలని సీబీఐ అభిప్రాయపడింది. వైఎస్ వివేకా వెంట కారులో ప్రయాణిస్తూనే గంగిరెడ్డి నిందితుడు సునీల్‌కి ఫోన్ చేసినట్లు సీబీఐ పేర్కొంది. ఆ సమయంలో అవినాశ్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నట్లు సీబీఐ తెలిపింది. వైఎస్ వివేకా హత్యకు అవినాశ్ రెడ్డి , భాస్కర్ రెడ్డి లే సూత్రదారులు అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని అఫిడవిట్‌లో సీబీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News